న్యాయస్థానాల గౌరవాన్ని పరిరక్షించడం మరియు కేసులతో సంబంధం ఉన్న వ్యక్తుల గోప్యతను కాపాడటమే లక్ష్యంగా సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో కోర్టు ప్రొసీడింగ్స్ వీడియోలు మరియు ఆడియోల వినియోగంపై సుప్రీంకోర్టు కఠిన ఆంక్షలు విధించింది. ముందస్తు అనుమతి లేకుండా న్యాయస్థానాల విచారణలకు సంబంధించిన రికార్డింగ్‌లను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంపై అత్యున్నత న్యాయస్థానం సంపూర్ణ నిషేధం విధిస్తూ స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలి కాలంలో లైవ్ స్ట్రీమింగ్ దృశ్యాలను విచ్చలవిడిగా వాడుతూ సంచలనం సృష్టిస్తున్న ధోరణికి అడ్డుకట్ట వేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
ఈ ఉత్తర్వుల ప్రకారం.. కోర్టు లైవ్ స్ట్రీమింగ్ లేదా రికార్డెడ్ వీడియోలను అనుమతి లేకుండా డౌన్‌లోడ్ చేయడం, తిరిగి పోస్ట్ చేయడం లేదా కట్ చేసి ఎడిట్ చేయడం తీవ్ర నేరంగా పరిగణించబడుతుంది. అంతేకాకుండా, న్యాయస్థాన దృశ్యాలను రీల్స్ లేదా మీమ్స్‌గా మార్చి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో అప్‌లోడ్ చేస్తూ ఆర్థిక లబ్ధి పొందడం (మానిటైజ్ చేయడం)పై పూర్తి నిషేధం విధించారు. అధికారిక అనుమతి లేకుండా కోర్టు రికార్డింగ్‌లను దాచడం లేదా ఇతర మాధ్యమాలకు ప్రసారం చేయడం చట్టవిరుద్ధమని, ఈ నిబంధనలను ఉల్లంఘించే వారిపై తీవ్రమైన చట్టపరమైన చర్యలు తప్పవని సుప్రీంకోర్టు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది.
Also Read:కొరియన్ కనకరాజు..నవ్వుతూనే ఉంటారు!
అదే సమయంలో విలేకరులు మరియు మీడియా సంస్థలకు అత్యున్నత న్యాయస్థానం బిగ్ రిలీఫ్ అందించింది. ఈ కొత్త ఆంక్షలు కేవలం వీడియో, ఆడియో రికార్డింగ్‌ల దుర్వినియోగానికి మాత్రమే వర్తిస్తాయని, కేసుల రిపోర్టింగ్‌పై ఎలాంటి ఆంక్షలు ఉండవని స్పష్టం చేసింది. న్యాయస్థానాల్లో జరిగే విచారణలను, న్యాయమూర్తుల వ్యాఖ్యలను యథాతథంగా రాతపూర్వక వార్తలుగా నివేదించే హక్కు జర్నలిస్టులకు యథావిధిగా ఉంటుందని పేర్కొంది. డిజిటల్ యుగంలో న్యాయ వ్యవస్థ పవిత్రతను కాపాడుతూనే, పత్రికా స్వేచ్ఛకు భంగం కలగకుండా సుప్రీంకోర్టు ఈ సమతుల్య నిర్ణయాన్ని తీసుకుంది.

