యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) తాజాగా తీసుకువచ్చిన కొత్త నిబంధనల అమలును సుప్రీంకోర్టు నిలిపివేసింది. ఈ నిబంధనలు స్పష్టత లేకుండా, అస్పష్టంగా ఉన్నాయని కోర్టు అభిప్రాయపడింది. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి (CJI) సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఉద్దేశించి, సమాజం విభజనలకు లోనుకాకుండా కలిసి ముందుకు సాగేందుకు సహకరించేలా ప్రముఖులతో కూడిన కమిటీ ఏర్పాటు చేయడంపై ఆలోచించాలని సూచించారు.
UGC రూపొందించిన కొత్త నిబంధనలు – “ప్రమోషన్ ఆఫ్ ఈక్విటీ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రెగ్యులేషన్స్, 2026” – దేశవ్యాప్తంగా తీవ్ర వివాదానికి దారితీశాయి. ఇవి ఏకపక్షంగా ఉండటమే కాకుండా, జనరల్ కేటగిరీ విద్యార్థులపై వివక్ష చూపుతున్నాయని విమర్శకులు ఆరోపిస్తున్నారు. ఈ నిబంధనలను సవాలు చేస్తూ అడ్వకేట్ వినీత్ జిందాల్, మృత్యుంజయ్ తివారీ, రాహుల్ దేవాన్‌లు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
ఈ నిబంధనల ప్రకారం, ప్రతి ఉన్నత విద్యాసంస్థలో ఈక్వల్ ఆపర్చునిటీ సెంటర్ ఏర్పాటు చేయాలి. ఈ కేంద్రం సివిల్ సొసైటీ సంస్థలు, పోలీసులు, జిల్లా పరిపాలన, అధ్యాపకులు, సిబ్బంది, స్థానిక మీడియాతో సమన్వయం చేయాలి. అలాగే జిల్లా, రాష్ట్ర న్యాయ సేవా సంస్థలతో కలిసి న్యాయ సహాయం అందించే బాధ్యత కూడా ఈ కేంద్రానిదే.
ఈ కేంద్రంలో OBCలు, SCలు, STలు, వికలాంగులు (PwDs), మహిళలకు ప్రాతినిధ్యం ఉండాలి. సమానత్వానికి సంబంధించిన విధానాల అమలు, వెనుకబడిన వర్గాలకు అకడమిక్, ఆర్థిక మార్గదర్శకత్వం ఇవ్వడం వంటి బాధ్యతలు ఈ కేంద్రానికి అప్పగించారు.
అయితే, “కుల ఆధారిత వివక్ష” నిర్వచనంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. UGC నిబంధనల ప్రకారం,..“కుల ఆధారిత వివక్ష అనేది కేవలం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సభ్యులపై మాత్రమే జరిగే వివక్ష” గా నిర్వచించడం వివాదాస్పదంగా మారింది. దీనికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో #ShameonUGC హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. జనరల్ కేటగిరీ విద్యార్థులను తప్పుదారి పట్టించేలా, వారిని దోషులుగా ముద్ర వేయడమే ఈ నిబంధనల ఉద్దేశమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
“UGC ఈక్విటీ రెగ్యులేషన్స్ 2026 జనరల్ కేటగిరీ విద్యార్థులను పుట్టుక ఆధారంగా నేరస్తులుగా చిత్రీకరిస్తున్నాయి. ఏకపక్ష కమిటీలు, తప్పుడు ఆరోపణల నుంచి రక్షణ లేకపోవడం వల్ల క్యాంపసులు కుల ఘర్షణలకు వేదికలుగా మారుతున్నాయి” అంటూ నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read:దుకాణాల్లో హైడ్రా రంగనాథ్ తనిఖీలు

