భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకు పెరిగిపోయిన నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి కేవలం అత్యవసర పిటిషన్లను మాత్రమే విచారించాలని..అవి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కోర్టు స్వీకరిస్తుందని తెలిపింది. ఇందుకు ఇద్దరు జడ్జులతో కూడిన ఒక్క బెంచ్ మాత్రమే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు వినాలని తీర్మాణించింది. రోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు వ్యక్తిగతంగా విచారణలను నిర్వహించవద్దని సుప్రీంకోర్టు నిర్ణయించింది.
న్యాయవాదులు వారి స్వంత కార్యాలయాల నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుకావచ్చు. రేపు సాయంత్రం 5 గంటలకు సుప్రీంకోర్టులో న్యాయవాదుల గదుల మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జస్టిస్ ఎస్.ఏ బోబ్డే, జస్టిస్ డీ.వై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో సోషల్ డిస్టెన్స్ పాటించాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. మరోవైపు ఈ నెల 31వ వరకు ఢిల్లీ ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించింది.