టీఆర్ఎస్‌ది ప్రజా ప్రభుత్వం:కేటీఆర్

203
ktr kukatpally
- Advertisement -

నాలుగన్నరేళ్లలో తెలంగాణలో శాంతిభద్రతల సమస్యల రానీయలేదన్నారు మంత్రి కేటీఆర్,కూకట్ పల్లి ఎన్‌ ఫంక్షన్ హాల్‌ మన హైదరాబాద్ కార్యక్రమంలో మాట్లాడిన కేటీఆర్ ప్రాంతాల వారీగానే విభజన జరిగిందని ప్రజల మధ్య విభజన జరగలేదన్నారు. నాడు బల్దీయా ఎన్నికల్లో వందసీట్లు గెలవకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరానని నేడు అదే సవాల్ విసుతున్నానని తెలిపారు. టీఆర్ఎస్ అధికారంలోకి రాకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని తన సవాల్‌ను స్వీకరించే దమ్ము విపక్షాలకు ఉందా అని ప్రశ్నించారు.

కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో కలిపేయాలని నాడు ఎన్టీఆర్ అన్నారని కానీ నేడు అదే కాంగ్రెస్‌తో చంద్రబాబు పొత్తు పెట్టుకొని ఆయన ఆత్మ క్షోభించేలా చేశారని తెలిపారు. హైదరాబాద్ కట్టింది చంద్రబాబేనని గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఒక్క బిల్డింగ్‌ కట్టి తానే హైదరాబాద్‌ను కట్టినట్లు ప్రచారం చేయడం సరికాదన్నారు. 9 ఏళ్లలో హైదరాబాద్ లాంటి మహానగరాన్ని నిర్మించిన చంద్రబాబు నాలుగున్నరేళ్లలో అమరావతిని ఎందుకు కట్టలేకపోయారని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్‌ని వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు అవకాశవాద రాజకీయాలు కొత్త కాదన్నారు.

కాంగ్రెస్ పాలనలో కరెంట్ ఉండేదని కాదని కానీ తెలంగాణ ఏర్పడిన అనతికాలంలో కరెంట్ సమస్యను అధిగమించామన్నారు. దేశంలో రైతులకు ఉచితంగా 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. నాలుగున్నరేళ్లలో ఏ ఒక్కవర్గంపై కూడా పక్షపాత వైఖరితో వ్యవహరించలేదన్నారు. కేసీఆర్‌ని ఎదుర్కొనే దమ్ములేక జతకట్టి వస్తున్నారని చెప్పారు. సింహం ఎప్పుడు సింగల్‌గానే వస్తుందని చెప్పారు.

కులం,మతం,ప్రాంతం పేరుతో టీఆర్ఎస్ ఎప్పుడు రాజకీయం చేయలేదన్నారు. ప్రజలపై విశ్వాసంతోనే ముందుకెళ్తున్నామని …టీఆర్ఎస్‌ది ప్రజా ప్రభుత్వమని చెప్పారు. గడిచిన నాలుగున్నరేళ్లలో 4 సెకన్లు కూడా కర్ఫ్యూ పెట్టలేదన్నారు. కూటమి పార్టీలకు కేసీఆర్‌ని ఎదుర్కొనే దమ్ములేదన్నారు.గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్‌కు తిరుగులేని మెజార్టీని కట్టబెట్టారని ఈ ఎన్నికల్లో సైతం టీఆర్ఎస్‌కు మద్దతివ్వాలన్నారు.

- Advertisement -