తమిళనాట తలైవా…తెలుగునాట ‘భాషా’, ఇప్పుడు పొలిటికల్ టూర్ కి రెడీ అయిపోతున్నాడు. ఎన్నో ఏళ్ళుగా తన రాజకీయ ప్రవేశంపై నాన్చుకుంటూ వచ్చిన రజినీకాంత్ మొత్తానికి పొలిటికల్ పోరుకి సిద్దమవుతున్నాడు.
రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నానని డిసెంబర్ 31న ప్రకటించిన ఈ సూపర్ స్టార్ .. త్వరలోనే రాజకీయ యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నాడు. ఈ క్రమంలోనే పార్టీ నిర్మాణం విషయంలో బిజీగా ఉన్న రజినీ… ఏప్రిల్ నుంచి జనం మధ్యకు రానున్నాడు. ఈ నేపథ్యంలోనే రజినీ ఓ సెంటిమెంట్ ని ఫాలో అవబోతున్నాడు.
తమిళనాట రాజకీయ రంగ ప్రవేశం చేసే వారికి తిరుచ్చి అచ్చొచ్చిన ప్రాంతం. అయితే అక్కడనుండే తన తొలి రాజకీయ సమావేశాన్నిఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాడు రజినీ. గతంలో ఇక్కడి నుంచే రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన నాయకులు తమిళనాడు రాజకీయాలను శాసించారు. అందుకే ఈ సెంటిమెంట్ కి కనెక్ట్ అయ్యాడు రజినికాంత్.
ఇక..రజినీ పొలిటికల్ ఎంట్రీ నేపథ్యంలో తమిళరువి మానియన్ అనే రాజకీయ నేత రజినీని గురువారం కలిశారు. చెన్నైలోని రజినీ నివాసానికి వెళ్లిన ఆయన త్వరలోనే రజినీ రాజకీయ సమావేశానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తానని చెప్పారు.
కాగా..ఇటీవలే కమల్ హాసన్ కూడా రాజకీయ పార్టీ పెట్టనున్నట్టు ప్రకటించాడు. దీంతో వీరిద్దరూ కలిసి పనిచేస్తే బావుంటుందనే అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటీవలే ఓ కార్యక్రమంలో పాల్గొన్న కమల్… రజనీ కాంత్ రంగు కాషాయం కాకుంటే ఆయనతో పొత్తు సాధ్యమవుతుందని చెప్పుకొచ్చారు.
ఇందుకు కారణం, రజనీ ఆధ్యాత్మిక భావాలున్న వ్యక్తి కావడంతో పాటు ఆయన బీజేపీతో చేతులు కలపవచ్చనే ఊహాగానాలు చాలాకాలంగా జోరుగా విన్పిస్తుండటమే! మతతత్వాన్ని పూర్తిగా వ్యతిరేకించే వ్యక్తిగా కమల్ తన మిత్రుడి రంగు కాషాయమైతే (అంటే బీజేపీ) ఆయనతో కలిసి పనిచేసే అవకాశమే లేదని ఒకరకంగా తేల్చి చెప్పేశారు. ప్రస్తుతానికైతే పొత్తు విషయంలో తనకు స్పష్టమైన అవగాహన లేదని కమల్ వెల్లడించాడు.
ఇదిలా ఉండగా..జయలలిత మరణంతో తమిళనాట రాజకీయ అనిశ్చితి నెలకొన్న విషయం తెలిసిందే. ఇక రజినీ పొలిటికల్ ఎంట్రీ ఖాయమవడంతో తలైవా ఫ్యాన్స్‌లో కొత్త ఉత్సాహం ఊపందుకుంది. త్వరలో రాజకీయ యాత్రకు రెడీ అవుతోన్న రజినీకి ‘తిరుచ్చి’ సెంటిమెంట్ ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.