జులై 1నుండి కేంద్రప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన జీఎస్టీ విధానం వల్ల పలు వ్యాపారాలకు జీఎస్టీ భారంగా మారింది. ఇప్పటికే జి.ఎస్.టి.భారాన్ని వ్యతిరేకిస్తూ పలు వ్యాపార యజమానులు నిరసనలు తెలియజేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే జీఎస్‌టీ ప్రభావంతో తమిళనాడులో 1,100 థియేటర్లు మూతపడ్డాయి. తమిళ సినీ పరిశ్రమ ఏకమై ఆందోళన చేపడుతోంది.
జీఎస్టీని నటుడు కమల్ హాసన్ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ ఉన్న హాలీవుడ్ సినిమాలతో సమానంగా ప్రాంతీయ సినిమాలపై జి.ఎస్.టి.వసూలుచేయడాన్ని కమల్ వ్యతిరేకించినా జి.ఎస్.టి. కౌన్సిల్ పట్టించుకోలేదు.
ఇదిలా ఉంటే..తాజాగా వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)పై ఎట్టకేలకు సూపర్‌స్టార్ రజనీకాంత్ స్పందించారు. తలైవా ట్విటర్ ద్వారా ఆయన అభిప్రాయాన్ని వెల్లడించారు. ‘తమిళ చిత్ర పరిశ్రమలో లక్షలాది మంది ప్రజల గురించి ఆలోచించి మా విన్నపాన్ని పరిగణించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు.
ఇదిలా ఉంటే..జీఎస్టీ వల్ల సినీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోతుందని, ధియేటర్ల యజమానులతో పాటు చిత్రపరిశ్రమ ప్రముఖులు ఆందోళన నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆందోళనలో పాల్గొన్న తమిళ ప్రముఖ సినీ దర్శకుడు టి. రాజేందర్ జీఎస్టీని తీవ్రస్థాయిలో వ్యవతిరేకించారు. అంతేకాకుండా త్వరలో రజినీ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నట్టు వార్తలు వస్తుండటంతో రజినీ పై కూడా విమర్శలు చేశాడు.
జీఎస్టీతో తమిళసినీ పరిశ్రమ నాశనమవుతుందని తెలిసినా ..జీఎస్టీపై రజనీకాంత్ స్పందించకపోవడం దురదృష్టకరమని, సినీ పరిశ్రమ గురించి ఆలోచించని రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు ఏం మంచి చేస్తారు? అని ఆయన ప్రశ్నించిన విషయం కూడా తెలిసిందే.