సూపర్ స్టార్ కృష్ణ భార్య విజయనిర్మల మృతి

650
vijayanirmala
- Advertisement -

అలనాటి నటీ, దర్శకురాలు, సూపర్ స్టార్ కృష్ణ భార్య విజయనిర్మల మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె నిన్న ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. తమిళనాడులో 1946 ఫిబ్రవరి 20వ తేదీన విజయనిర్మల జన్మించారు. విజయ నిర్మల నటుడు సూపర్‌స్టార్ కృష్ణ సతీమణి. విజయనిర్మలకు నరేష్ ఒక్కడే సంతానం. ఏడేళ్ల వయస్సులో బాలనటిగా తమిళచిత్రం మత్స్యరేఖతో అరంగేట్రం చేశారు. 11 ఏళ్ల వయస్సులో పాండురంగమహత్యం చిత్రంలో తెలుగులో విజయనిర్మల పరిచయం అయ్యారు. విజయనిర్మల తండ్రిది చెన్నై కాగా, తల్లి గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందినవారు.

‘రంగులరాట్నం’ సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా అరంగేట్రం చేసిన విజయనిర్మల దాదాపు 200కు పైగా తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో నటిగా మెప్పించారు. పూల రంగడు, సాక్షి, అసాధ్యుడు, బంగారు గాజులు, బొమ్మా బొరుసు, మోసగాళ్లకు మోసగాడు, పండంటి కాపురం, పాడిపంటలు, అల్లూరి సీతరామరాజు, తాతామనవడు, కురుక్షేత్రం, తదితర చిత్రాల్లో నటించారు. ‘పెళ్లి కానుక’ సీరియల్‌తో బుల్లితెర ప్రవేశం చేసి అలరించారు.

విజయనిర్మల మొదటి భర్త కృష్ణమూర్తితో విడిపోయిన తర్వాత కృష్ణను రెండో వివాహం చేసుకున్నారు. టాలీవుడ్ ప్రముఖ నటుడు సీనియర్ నరేశ్ ఆమె కుమారుడే. విజయనిర్మల మృతి వార్త తెలిసి తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి చెందింది.కృష్ణతో కలిసి 47 చిత్రాల్లో ఆమె నటించారు. విజయనిర్మల దర్శకత్వం వహించిన అత్యధిక చిత్రాల్లో హీరోగా కృష్ణ నటించారు. అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా విజయ నిర్మల గిన్నిస్ రికార్డులో సాధించారు. 44 సినిమాలకు దర్శకత్వం వహించారు.

- Advertisement -