రొమాంటిక్ సినిమాకు చాలా ఇష్టంగా ప‌నిచేశాం: సునిల్ క‌శ్య‌ప్‌

95
- Advertisement -

యంగ్ హీరో ఆకాష్ పూరి, అందాల హీరోయిన్ కేతిక శర్మ కాంబోలో వస్తోన్న ‘రొమాంటిక్’ చిత్రం అక్టోబర్ 29 విడుదల కాబోతోంది. పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకిస్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మీలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. రొమాంటిక్ సినిమాను అనిల్ పాదురి తెరకెక్కించారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సోమవారం మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ కశ్యప్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

ఈ సినిమాలో సరదాగా చేసిన పాటలు చాలా ఉన్నాయి. మా ఇస్మార్ట్ గ్యాంగ్ అంతా అలా కూర్చుని సరదాగా చేసిన పాటే పీనే కే బాద్. పూరిగారికి కూడా పాట‌లు చాలా నచ్చాయి. అనిల్ అయితే పర్టిక్యులర్‌గా ఆ పాటలే కావాలని అనేవాడు. కథ విన్నప్పటి నుంచి రొమాంటిక్ టైటిల్ అని పెట్టినప్పటి నుంచి నేను కూడా రొమాంటిక్ అయిపోయి ఈ పాటలను కంపోజ్ చేశాను.

ఈ చిత్రంలో కేతిక శర్మ కూడా ఓ పాట పాడింది. నా వల్ల కాదే అనే పాట అది పెద్ద హిట్ అయింది. ఆమె నటిగానే కాకుండా సింగర్‌గా కూడా చాలా బాగా పాడింది. ఆమె చేత పాడించాలని ముందే ఫిక్స్ అయ్యాం. ఈ మధ్య విడుదల చేసిన వాస్కోడిగామ పాటలో ఆకాష్ వాయిస్ అద్బుతంగా ఉంటుంది. పూరి గారి కన్నా ఆకాష్ వాయిస్ బాగా వచ్చింది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆకాష్ మాట్లాడిన తీరు చూశాక ఆయనలోని కసి కనబడింది. కచ్చితంగా సినిమా హిట్ అవుతుంది. అతనిలో మంచి ఈజ్ ఉంది.

పీనే కే బాద్ పాట చాలా పెద్ద హిట్ అయింది. నాకు తెలిసిన వాళ్లు కూడా ఫోన్ చేసి పీకే కే బాద్ అని మాట్లాడుతున్నారు. రాత్రి పూట ఆ పాట పెట్టుకుని కూడా ఎంజాయ్ చేస్తున్నారు. నేను తెలియని వాళ్లు కూడా నా నంబర్ తీసుకుని మరీ ఫోన్ చేస్తున్నారు.

నటన పరంగా ఆకాష్ ని మరో మెట్టు ఎక్కించే చిత్ర‌మిది. ఆర్ఆర్ చేసేటప్పుడు ఆ విష‌యం నాకు అర్థమైంది. హీరోలు ఎంత బాగా చేస్తే నేను అంత బాగా ఆర్ఆర్ ఇవ్వగలను. దర్శకుడిగా అనిల్ అద్భుతంగా తెర‌కెక్కించాడు. అందరం కూడా చాలా ఇష్టపడి ఈ సినిమాను చేశాం.

ఈ చిత్రంలో చాలా ఎమోషనల్ కంటెంట్ ఉంది. ద్వితీయార్థం ఫుల్ ఎమోషనల్‌గా ఉంటుంది. పూరి గారు మామూలుగా ఎప్పుడూ ఎమోషనల్ అవ్వరు.. అలాంటిది ఆయ‌న కంట్లోంచి కూడా నీళ్లు వ‌చ్చాయి.అది చూశాక నా పని మీద నాక్కూడా నమ్మకం వచ్చింది. ఎమోషనల్‌గా టచ్ అయిందని అనుకున్నాను. రేపు ప్రేక్షకులు కూడా అదే ఫీల్ అవుతారని అనుకుంటున్నాను.

మేం అంతా ఒక చోట కలిశామంటే ఎంతో సరదాగా ఉంటుంది. పూరి గారు, ఛార్మీ గారు మేం అంతా ఉంటే నేను గిటార్ పట్టుకుని వాయిస్తుంటాను. అందరం సరదాగా ఎంజాయ్ చేస్తాం. అంతే కానీ ఇప్పుడు క‌చ్చితంగా ఈ పని చేయాలి.. అని అనేవారు లేరు…అనిపిస్తే చేయాలి లేకుంటే లేదు అంతే. కరోనా దయ వల్ల కావాల్సినంత టైం కూడా దొరికింది. అందుకే కష్టం కన్నా ఇష్టం ఎక్కువగా పెరిగింది. సెకండాఫ్ ఆర్ఆర్ ముంబైలో జరిగింది. పూరి గారితో ఉంటే సెన్సాఫ్ హ్యూమర్ ఎక్కువగా పెరుగుతుంది.

నా జర్నీలో ఎక్కువగా భాస్కరభట్ల గారే ఉంటారు. ఇక ఈ చిత్రంలో పీనే కే బాద్ అనే పాటను అద్భుతంగా రాశారు. ఆయన ఒక్కొక్క పదాన్ని రాస్తుంటే మేం అలా ఆశ్చర్యపోయేవాళ్లం. నా వల్ల కాదే అనే పాటను కూడా అద్భుతంగా రాసేశారు. ఆయనతో నాకు ఇది నాలుగో చిత్రం. జ్యోతి లక్ష్మీ నుంచి రొమాంటిక్ వరకు నాకు బలంగా మారిపోయారు.

కేతికను మొదటగా చూసింది పాట పాడుతున్న ఆల్బంలోనే. అలా ఆమెను పూరి గారు తీసుకున్నారు. పాటలు పాడుతుందని తెలిసే తీసుకున్నాం. ఆమెతో పాడించాలని అందరం ఫిక్స్ అయ్యాం.

చిన్న సినిమా పెద్ద సినిమాకు పని చేశామని కాదు.. హిట్ అయితే అదే పెద్ద సినిమా అవుతుంది. అదే ఫ్లాప్ అయితే నార్మల్ సినిమా అవుతుంది. ఏదైనా ఉంటే పూరి గారు నాకు వెంటనే చెబుతారు. ప్రతీ సినిమాకు నన్ను పిలుస్తారు. ఆయన సినిమాలు నాకు ఇవ్వాలని ఏమీ లేదు. ఇవ్వకపోయినా ఆయనతో ఉండటమే నాకు ఇష్టం. అయినా ఒకప్పుడు ఏ స్థాయిలో ఉన్నాను.. ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాను అనేది చూసుకుంటాను. ఏం జరిగినా మ‌న‌ మంచికే. అలానే ముందుకు వెళ్లాలని అనుకుంటాను. హిందీలోనూ రెండు సినిమాలు చేశాను.

సినిమాలే కాకుండా క్లాసికల్ సంగీతం వైపు వెళ్లాలని అనుకుంటున్నాను. భవిష్యత్తులో నా నుంచి క్లాసికల్ వేరియేషన్స్, క్లాసికల్ ఫ్యూజన్స్ రావ‌చ్చు. ప్రతీ సినిమాలో అలాంటివి చేయలేం. కానీ ప్రైవేట్ ఆల్బమ్‌లో అయితే మన ఇష్టమున్నట్టు చేసుకోవచ్చు. ప్రస్తుతం సత్యదేవ్ హీరోగా న‌టిస్తోన్న‌ గాడ్సే సినిమాను చేస్తున్నాను. మ‌రో రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటి వివ‌రాలు త్వ‌ర‌లో తెలియ‌జేస్తానన్నారు.

- Advertisement -