సంక్రాంతికి నేను నటించిన రెండు చిత్రాలు విడుదలై మంచి విజయాలను సాధించాయి. నటుడుగా నాకు మంచి పేరును తెచ్చాయని అంటున్నాడు నటుడు సునీల్‌కుమార్. గౌతమిపుత్ర శాతకర్ణ బౌద్ధ సన్యాసి ధర్మనందనుడుగా, హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య చిత్రంలో విలన్ క్యారెక్టర్‌లో నటించిన సునీల్ కుమార్ మంగళవారం మీడియాతో ముచ్చటించాడు. తన సినిమాల గురించి సునీల్‌కుమార్ మాట్లాడుతూ – “నేను మధ్య ప్రదేశ్‌లోని ఉజ్జ్ఞయినిలో పుట్టి పెరిగాను. నా చదువులో ఎక్కువ భాగంలో అక్కడే కొనసాగింది. మా నాన్నకు హోటల్ బిజినెస్ ఉంది. అయితే నటుడుగా రాణించాలనే కోరిక నాలో బలంగా ఏర్పడింది. అందులో భాగంగా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తుండేవాడిని. ఫోటోలు తీసుకుని చాలా సినిమా ఆఫీసులకు వెళుతూ వస్తుండేవాడిని.
అలా ఓసారి టాలీవుడ్ సీనియర్ దర్శకుడు బాపుగారు నా ఫోటోలను చూసి ఆయన చేస్తున్న భాగవతంలో నన్నురాముడు, కృష్ణుడు పాత్రల కోసం ఎంపిక చేశారు. తర్వాత రాధాగోపాలం, సుందరకాండ సినిమాల్లో కూడా నటించాను. తర్వాత యాక్సిడెంట్ కారణంగా సినిమాల్లో నటించలేకపోయాను. అందుకే మధ్యలో సినిమాలకు గ్యాప్ వచ్చింది. ఈ సంక్రాంతికి విడుదలైన నాలుగు చిత్రాల్లో బాలకృష్ణగారు, క్రిష్ కాంబినేషన్‌లో వచ్చిన గౌతమిపుత్ర శాతకర్ణి, ఆర్.నారాయణమూర్తి, చదలవాడ శ్రీనివాసరావు కాంబినేషన్‌లో వచ్చిన హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య చిత్రాలు విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాల్లో రెండు విభిన్నమైన పాత్రలు చేశాను. రెండు పాత్రలకు నాకు మంచి పేరు వచ్చింది. చాలా మంది ఫోన్స్ చేసి అభినందిస్తున్నారు.
ధర్మనందనుడు పాత్ర కోసం ముందు చిన్నవెంట్రుకలు ఉండి గుండు కోసం మేకప్ వేస్తామని అనుకున్నారు. కానీ మేకప్ సెట్ కాకపోవడంతో గుండు కొట్టుకుంటావా అని క్రిష్ అడిగారు. నేను వెంటనే ఎస్ చెప్పేసి గుండు కొట్టేశాను. ఇప్పుడు సినిమాలో నా పాత్ర చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. హేమామాలిని, బాలకృష్ణతో కలిసి నటించడం మరచిపోలేని అనుభూతినిచ్చింది. బాలకృష్ణగారు చాలా ప్రొఫెషనల్ నటుడు. సెట్స్‌లో చాలా ఎనర్జిటిక్‌గా ఉంటారు. డైలాగ్స్ చెప్పే విషయంలో కూడా నాకు సలహాలిచ్చారు. చాలా మంచి పాత్రలు చేయాలని ఎదురుచూస్తున్నాను“ అన్నారు.