బరామతి అసెంబ్లీ ఉపఎన్నికలో పోటీ చేయనున్నారు సునేత్రా పవార్. ఎన్‌సీపీ కీలక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. బరామతి అసెంబ్లీ స్థానం నుండి దివంగత నేత, మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రాతినిధ్యం వహించగా జనవరి 28న జరిగిన విమాన ప్రమాదంలో మరణించారు.
2024 అసెంబ్లీ ఎన్నికల్లో అజిత్ పవార్ 1,00,899 ఓట్ల మెజారిటీతో తన మేనల్లుడు యుగేంద్ర పవార్‌ను ఓడించారు. అజిత్ పవార్‌కు 1,81,132 ఓట్లు రాగా, యుగేంద్ర పవార్‌కు 80,233 ఓట్లు వచ్చాయి. త్వరలో ఉప ఎన్నిక జరగనుండగా సునేత్ర పవార్ పోటీ చేయనున్నారు.
ఇదే సమావేశంలో పార్థ్ పవార్‌ను రాజ్యసభకు నామినేట్ చేయాలని కూడా పార్టీ నిర్ణయించింది. ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న సునేత్ర పవార్ స్థానంలో పార్థ్ పవార్ బాధ్యతలు చేపట్టనున్నారు. మహారాష్ట్ర మహాయుతి ప్రభుత్వంలో సునేత్ర పవార్ ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.
మహారాష్ట్రలో ఖాళీగా ఉన్న ఏడు రాజ్యసభ స్థానాలకు మార్చి 16న ఎన్నికలు జరగనున్నాయి. ఎన్‌సీపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ఫిబ్రవరి 26న ముంబైలోని వొర్లీ డోమ్‌లో జరగనుంది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నాయకులు హాజరయ్యే ఈ సమావేశంలో సునేత్ర పవార్ పేరును అధికారికంగా ఆమోదించనున్నారు. అజిత్ పవార్ మరణానంతరం పార్టీ ఏకగ్రీవంగా ఆమెను జాతీయ అధ్యక్షురాలిగా ఎన్నుకోవాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఆమె ఉప ముఖ్యమంత్రిగా, శాసనసభా పక్ష నాయకురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ALso Read:షూతో కీళ్ల నొప్పులు..షాకింగ్!

