డిప్యూటీ సీఎంగా సునేత్రా బాధ్యతలు స్వీకరణ

3
- Advertisement -

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా సునేత్రా పవార్ మంగళవారం ముంబైలోని మంత్రాలయంలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఇటీవలే రాష్ట్ర తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఆమె, మంత్రాలయంలోని తన కార్యాలయంలో ‘డిప్యూటీ సీఎం’ కుర్చీలో కూర్చొని అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమెతో పాటు కుమారుడు పార్థ్ పవార్, ఎన్‌సీపీకి చెందిన సీనియర్ నేతలు హాజరయ్యారు.

బాధ్యతలు స్వీకరించే ముందు సునేత్రా పవార్ ఉదయం ముంబైలోని ప్రసిద్ధ సిద్ధివినాయక ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ దర్శనంలో ఆమెతో పాటు పార్థ్ పవార్, ఎన్‌సీపీ సీనియర్ నేత ప్రఫుల్ పటేల్, మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రూపాలి చకంకర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం దాదర్‌లోని చైతన్యభూమిని సందర్శించి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు పుష్పాంజలి ఘటించి మౌన నివాళి అర్పించారు.

తర్వాత ఎన్‌సీపీ కార్యాలయాన్ని సందర్శించిన సునేత్రా పవార్‌కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అక్కడ తన భర్త, మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌కు ఆమె నివాళులు అర్పించారు. మద్దతుదారులు నినాదాలతో ఉత్సాహం వ్యక్తం చేశారు.

జనవరి 31న సునేత్రా పవార్ మహారాష్ట్ర తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. జనవరి 28న జరిగిన విమాన ప్రమాదంలో ఆమె భర్త, మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మృతి చెందడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

Also Read:TTD:లడ్డూ విక్రయ కేంద్రాల వద్దే UPI పేమెంట్స్‌

కేబినెట్ శాఖల కేటాయింపులో సునేత్రా పవార్‌కు రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, మైనారిటీ అభివృద్ధి శాఖలు అప్పగించారు. అలాగే పుణె, బీడ్ జిల్లాలకు గార్డియన్ మంత్రిగా నియమితులయ్యారు. రాబోయే రోజుల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా కేంద్ర నేతలను కలిసేందుకు ఆమె ఢిల్లీ వెళ్లే అవకాశముంది. ముంబైకి వెళ్లే ముందు పుణెలోని రూబీ హాల్ క్లినిక్‌లో చికిత్స పొందుతున్న ఎన్‌సీపీ (శరద్‌చంద్ర పవార్ వర్గం) అధినేత శరద్ పవార్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.

- Advertisement -