నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణంపై చాలా ఏళ్లుగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరపడింది. సుభాష్ చంద్రబోస్ 1945 ఆగష్టు 18న జరిగిన విమాన ప్రమాదంలో మృతిచెందాడని కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. బోస్ మరణంపై వివరణ ఇవ్వాల్సిందిగా ఆర్టీఐ దాఖలైంది. సుభాష్ చంద్రబోస్ మృతిపై ఏర్పాటు చేసిన షానవాజ్ కమిటీ, జస్టిస్ జీడీ ఖోస్లా కమిషన్, జస్టిస్ ముఖర్జీ కమిషన్‌లు ఇచ్చిన నివేదిక ఆధారంగా నేతాజీ మరణించినట్లు కేంద్ర హోంమంత్రిత్వశాఖ తెలిపింది.
ఉత్తర్‌ప్రదేశ్‌లో 1985 వరకు గుమ్నామీ బాబా అనే వ్యక్తి సుభాష్ చంద్రబోస్ పోలికలతో ఉండేవాడని.. ఆయనపై ప్రభుత్వం దగ్గర ఏమైనా సమాచారం ఉంటే ఇవ్వాలని ఏప్రిల్‌లో ఆర్టీఐ దాఖలైంది. గుమ్నామీ బాబాకు సంబంధించి ముఖర్జీ కమిషన్ ఇచ్చిన రిపోర్టులో 114-122 మధ్య పేజీల్లో సమాచారం ఉందని కేంద్ర హోంశాఖ తెలిపింది. క్షుణ్ణంగా ఎంక్వైరీ చేసిన ముఖర్జీ కమిషన్ గుమ్నామీ బాబా సుభాష్ చంద్రబోస్ కాదని తేల్చిచెప్పడంతో ఇక అనుమానాలకు తావులేదని కేంద్రం వివరించింది.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు నేతాజీ కుటుంబ సభ్యులు. కేంద్రం పూర్తిగా బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు. ముందుగా తను బోస్ కుటుంబ సభ్యుడినని ఆ తర్వాతే బీజేపీ నేతనని చెప్పిన చంద్ర కుమార్ బోస్ … కేంద్రం చేసిన బాధ్యతారహిత వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం వెంటనే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను ఏర్పాటు చేసి బోస్ కేసును మళ్లీ విచారించి.. నిజనిజాలు వెలికితీయాలని డిమాండ్ చేశారు.
1897, జనవరి 23. ఒడిశాలోని కటక్ సిటీలో ఓ సంపన్నకుటుంబంలో పుట్టాడు చంద్రబోస్. తండ్రి జానకీనాథ్ బోస్…గొప్ప లాయర్. జాతీయవాది కూడా. బెంగాల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కు కూడా ఎన్నికయ్యారాయన. చిన్నప్పటి నుంచి తండ్రి అడుగుజాడల్లో నడిచిన బోస్… చదువులోనే కాదు, దేశ భక్తిలో కూడా ఓ అడుగుముందుండే వాడు. పుట్టుకతోనే ధనవంతుడు కావడంతో… ఉన్నత చదువులు చదివాడు. 1920లో రాసిన భారతీయ సివిల్ సర్వీసు పరీక్షల్లో ఫోర్త్ ర్యాంక్ కొట్టాడు బోస్. జాబ్ వచ్చింది.. 1921లో జాబ్ కు రిజైన్ చేసి… స్వాతంత్ర్య ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. భారత జాతీయ కాంగ్రెస్ యువజన విభాగంలో చురుకైన పాత్ర పోషించాడు. రెండుసార్లు పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు.
స్వాతంత్ర్యం అంటే బిచ్చమడిగి తీసుకునేది కాదు.. పోరాడి సాధించుకోనే హక్కు..నేను మీకు ఆకలి. దాహం, కష్టం, మృత్యువు మాత్రమే ఇవ్వగలరు.. నాకు మీ రక్తాన్ని ఇవ్వండి.. మీకు స్వాతంత్య్రాన్ని ఇస్తాను అంటూ నేతాజి చెప్పిన మాటలు ఇప్పటికే అందరికి గుర్తుండే ఉంటాయి. అందుకే సైనిక పోరాటం ద్వారానే బ్రిటిషర్లను దేశం నుంచి తరిమేయగలమని నేతాజీ సుబాష్ చంద్రబోస్ విశ్వసించారు. అందుకోసం ఆయన రెండో ప్రపంచ యుద్ధ సమయం(1942)లో ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ పేరుతో ఇండియన్ నేషనల్ ఆర్మీ (ఐఎన్ఏ)ని ఏర్పాటు చేశారు. ఆజాద్ హిందూ ఫౌజ్ ద్వారా బ్రిటిష్ వారికి కంటిమీద నిద్ర లేకుండా చేసిన సుభాష్ చంద్రబోస్ ఆ తర్వాత కనిపించకుండా పోవడం మిస్టరీగా మారింది.