భారతీయ కళలకు పునరుజ్జీవం తేవాలి:Bhumana

33
- Advertisement -

సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా భారతీయ సంప్రదాయ కళలైన సంగీతం, నృత్యం, వాద్యకళలను ప్రోత్సహించేందుకు టీటీడీ ఎంతగానో కృషి చేస్తోందని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర రెడ్డి తెలిపారు. టీటీడీకి చెందిన శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల మరియు ఎస్వీ నాదస్వరం, డోలు పాఠశాల ఆధ్వర్యంలో కళావైభవం పేరిట మూడు రోజుల దక్షిణ భారత సంగీత నృత్యోత్సవం తిరుపతి మహతి కళామందిరంలో బుధవారం ఉదయం ఘనంగా ప్రారంభమైంది.

సంగీతం, సాహిత్య కళలతోనే మానవ నాగరికత వికసించిందన్నారు భూమన. ప్రస్తుతం ఉన్న ఉరుకుల పరుగుల జీవితాల్లో ఒత్తిడి నివారణకు సంగీతం ఎంతగానో దోహదపడుతుందన్నారు. సంగీత, నృత్య కళలను నేర్చుకున్న వారికి ఉపాధి అవకాశాలు తగ్గడంతో ఎక్కువ మంది ఈ కళలను నేర్చుకోవడానికి ముందుకు రావడం లేదన్నారు. ఈ కళలను బతికించుకునేందుకు ప్రజలు ఉపాధి కోసం కాకుండా దైనందిన జీవితంలో ప్రత్యామ్నాయంగా ఉండేలా నేర్చుకోవాలన్నారు.

పురాతనమైన ఈ కళలను ప్రోత్సహించేందుకు టీటీడీ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ సంగీత, నృత్య కళాశాల, నాదస్వర, డోలు పాఠశాలను నిర్వహిస్తోందని చెప్పారు. ఎస్వీ సంగీత నృత్య కళాశాల ఎందరో మహామహులైన కళాకారులను తయారు చేసిందన్నారు.  ఘంటసాలకే రాగాలు నేర్పిన  బాలాంత్రపు రజనీకాంతరావుతో పాటు  నేదునూరి కృష్ణమూర్తి,  నూకల చినసత్యనారాయణ లాంటి ఎందరో మహానుభావులు ఈ కళాశాలలో సేవలందించారని కొనియాడారు. ఈ కళలను ప్రచారం చేయడం ద్వారా మన సంస్కృతి పరిఢవిల్లేందుకు ఎస్వీ సంగీత, నృత్య కళాశాల విద్యార్థులు సన్నద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

Also Read:గోంగూర ఎక్కువగా తింటున్నారా?

- Advertisement -