ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నారాయణపై దాడి చేశారు విద్యార్ది సంఘాల నేతలు. అనంతపురం పర్యటన సందర్భంగా నారాయణ స్కూల్స్ పర్యవేక్షకు వచ్చిన నారాయణను స్థానిక విద్యార్థి సంఘాల నేతలు అడ్డుకున్నారు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని నిలదీశారు. ఈ క్రమంలో విద్యార్ధి సంఘాల నేతలను నారాయణ అనుచరులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటుచేసుకుంది.
దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో కొంతమంది నారాయణను చొక్కా పట్టుకుని లాగారు. ఈ తోపులాటలో నారాయణ చొక్కా చిరిగిపోయింది. ఈ ఘటనతో నారాయణ అనుచరులు విద్యార్థులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సార్‌ను చొక్కా పట్టుకొని లాగుతారా అంటూ మండిపడ్డారు.
ఈ క్రమంలో కొందరు విద్యార్థులు మాజీ మంత్రి నారాయణ కారుపై రాళ్లతో దాడి చేశారు. విద్యార్దులు రాళ్లతో దాడి చేయడంతో కారు అద్దాలు ధ్వసం అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గొడవకు చెదరగొట్టారు. నారాయణ అనుచరుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.