ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో విషాదం నెలకొంది. కుంభమేళాకు వెళ్లే ప్రయాణికులతో రైల్వే స్టేషన్ ప్రాంతం పోటెత్తింది. ఈ ఘటనలో 10మంది మహిళలు, నలుగురు చిన్నారులు సహా 18మంది మృతిచెందారు. ప్రయాగ్ రాజ్ కు మరో ప్రత్యేక రైలు ఏర్పాటు చేసినట్లు రైల్వేశాఖ ప్రకటించగా ఆ రైలును అందుకునే క్రమంలో ప్రయాణీకులు ఒక్కసారిగా 14వ నంబర్ ప్లాట్ ఫాంపైకి రావటం వల్ల తొక్కిసలాట జరిగింది.
తొక్కిసలాట ఘటనలో 30మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు. కొందరు మహిళలు ఊపిరాడక స్పృహతప్పి పడిపోయారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హుటాహుటీన లోక్‌నాయక్ జైప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఘటనాస్థలిలో ప్రయాణికుల బ్యాగులు, దుస్తులు, చెప్పులు చెల్లాచెదురుగా పడ్డాయి. సుమారు 15 నుంచి 20 నిమిషాల పాటు రైల్వే స్టేషన్ లో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. రైల్వే స్టేషన్లో తొక్కిసలాట ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో జరిగిన తొక్కిసలాట నన్ను బాధించింది. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారి చుట్టే తన ఆలోచనలు ఉన్నాయి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాను అని పేర్కొన్నారు.
Also Read:కేసీఆర్ బర్త్ డే..సేవా కార్యక్రమాలకు పిలుపు

