శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలకు బుధవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణం జరిగింది. ముందుగా సాయంత్రం సేనాధిపతివారిని ఆలయ మాడవీధుల గుండా ఊరేగింపుగా వసంతమండపానికి వేంచేపు చేశారు. అనంతరం మృత్సంగ్రహణం, ఆస్థానం నిర్వహించారు. ఆ తరువాత ఆలయంలోని పవిత్ర మండపంలో అంకురార్పణ వైదిక కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి పాల్గొన్నారు.
శ్రీవారి ఆలయంలో ఆగస్టు 15 నుంచి 17వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. అంకురార్పణ కారణంగా బుధవారం సాయంత్రం సహస్రదీపాలంకార సేవను టీటీడీ రద్దు చేసింది.
ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి. 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది.
Also Read:Modi: 2047 నాటికి వికసిత్ భారతే లక్ష్యం