రేపు శ్రీశైలం గేట్లు ఎత్తివేత…!

627
srishilam dam
- Advertisement -

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం జలాశయానికి భారీ స్థాయిలో వరద నీరు పోటెత్తుతుండటంతో నిండు కుండలా మారింది. బుధవారం డ్యామ్‌లో 153 టీఎంసీల నీటి నిల్వ ఉండి.. నీటిమట్టం 872.60 అడుగులకు చేరింది.

వరద ప్రవాహంతో శ్రీశైలం డ్యామ్ గురువారం రాత్రికి పూర్తిస్థాయిలో నిండుతుందని జలవనరులశాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో శుక్రవారం శ్రీశైలం గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. 2009లో వరదల తర్వాత శ్రీశైలం జలాశయానికి 4లక్షల క్యూసెక్కుల నీరు రావడం ఇదే తొలిసారి.

శ్రీశైలం నుంచి నీరు దిగువనకు విడుదల చేస్తుండటంతో నాగార్జున సాగర్ లో 134 టిఎంసిల నీరు చేరింది. ఇక రేపు శ్రీశైలం గేట్లు ఎత్తితే నాగార్జున సాగర్ కు వరద పోటెత్తుతుందని, ఆ సమయంలో నాగార్జున సాగర్ లో 815 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని జెన్ కో నిర్ణయించింది. నాగార్జున సాగర్ నుంచి కూడా నీరు విడుదలయితే పులిచింతలలో 120 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని జెన్ కో నిర్ణయించింది.

భారీ వర్షాలతో అటు కర్ణాటకలోనూ జలకళ సంతరించుకుంది. వరద నీటితో జలాశయాలన్నీ నిండుకుండలా మారాయి. రాష్ట్రంలోని సగానికి పైగా జలాశయాల్లో నీటి నిల్వ ప్రమాదపు స్థాయికి చేరుకుంది. ఉత్తర కర్ణాటకలోని ఐదు జిల్లాలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు.

- Advertisement -