కరెంటు కోతలతో మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండల పరిధిలోని హన్వాడ, మాదారం, కొమ్మిరెడ్డిపల్లి, మునిమోక్షం గ్రామాల్లో ఎండిన పంటలను మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. మునిమోక్షం సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించారు.
వ్యవసాయం మీద ఆధారపడిన మహబూబ్‌నగర్ జిల్లా.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వలస వెళ్లిన వారు తిరిగి వచ్చి వ్యవసాయం చేసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కరెంటు లేక పంటలు ఎండుతున్నాయి.. తిరిగి వలసలు వెళ్లే పరిస్థితి తీసుకొచ్చారు. కోతల కరెంట్ కారణంగా కాలువలు తడుస్తున్నాయి తప్ప.. మడుల్లోకి నీరు రావడం లేదు. వరి పంట కోసం ఎకరానికి రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు అప్పు చేసుకున్నారు. ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించాలి అని డిమాండ్ చేశారు.
ఎరువుల సంచులను బ్లాక్‌లో తెచ్చుకున్నారు.. నకిలీ డీఏపీ ఇచ్చారు. మేము అధికారంలో ఉన్నప్పుడు నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మినవారిపై పీడీ యాక్ట్ పెట్టాం.బొగ్గు ఉంది.. కరెంటు ఉత్పత్తి లేదు. జూరాల కింద నీరు ఉంది.. పంటలకు నీరు ఇవ్వడం లేదు. ఆంధ్రప్రదేశ్‌కు నీళ్లు పోతున్నాయి.. కానీ మహబూబ్‌నగర్ రైతులకు సాగునీరు లేదు. పాలమూరు ప్రాజెక్టు కాలువలు పూర్తి చేసి ఉంటే రైతుల పొలాల్లోకి నీళ్లు వచ్చేవి. రెండో పంట వేయవద్దని చెబుతున్నారు.. ఇప్పుడు ఎండిన పంటలకు నష్టపరిహారం గురించి మాట్లాడటం లేదు. ఐఏఎస్ అధికారుల బృందాలను జిల్లాలకు పంపించి ఎండిన పంటల వివరాలు సేకరించాలి. ఎకరాకు రూ.25 వేల నష్టపరిహారం ఇవ్వాలి. కొన్ని చోట్ల 10–20 ఎకరాల్లో పంట వేసిన రైతులకు కేవలం ఒకటి, రెండు ఎకరాల్లో మాత్రమే పంట మిగిలింది. సరిగ్గా కరెంటు ఇవ్వకపోతే ఆ పంట కూడా చేతికి రాకుండా పోతుంది. రైతుల ఇళ్లలో తినడానికి బియ్యం కూడా లేకుండా పోతాయి. గ్రామాల్లో పశువులు, మేకలు తాగేందుకు నీరు కూడా లేని పరిస్థితి ఉంది. కొన్ని గ్రామాల్లో మనుషులకు తాగునీరు కూడా అందడం లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read:చంద్రబాబుది క్రిమినల్ మెంటాలిటీ

