శ్రీలంకను క్లీన్‌ స్వీప్‌ చేసిన భారత మహిళలు

88
women
- Advertisement -
       భారత మహిళల జట్టు శ్రీలంక పర్యటనను విజయవంతంగా ముగించుకొంది.  మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి రెండు మ్యాచులను నెగ్గిన భారత మహిళల జట్టు. పల్లెకెల వేదికగా జరిగిన మూడో వన్డేలో విజయం సాధించడంతో సిరీస్‌ను 3-0తో క్లీన్‌ స్వీప్‌ చేసింది.

తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనలో శ్రీలంక.. 216 పరుగులకే కుప్పకూలింది. మిథాలీ రాజ్ నిష్క్రమణ తర్వాత వన్డే కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన హర్మన్‌ప్రీత్ కౌర్ తొలి విదేశీ సిరీస్ లోనే క్లీన్ స్వీప్ తో బోణీ కొట్టింది.

ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత జట్టు.. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (88 బంతుల్లో 75,7ఫోర్లు, 2సిక్స్‌లు ) పూజా వస్ర్తకార్‌ (65బంతుల్లో 56,3సిక్స్‌లు ) లు కలిసి ఏడో వికెట్‌కు 97పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో భారత్‌ మెరుగైన స్కోరును సాధించింది. వీరితో పాటు ఓపెనర్‌ షఫాలీ శర్మ (49), యస్తిక భాటియా (30) పరుగులు సాధించి జట్టు విజయంలో తమ వంతు భాద్యత నెరవేర్చారు.

అనంతరం లక్ష్య ఛేదనలో శ్రీలంక అమ్మాయిలు త్వరత్వరగా వెనుదిరిగారు. కాని కెప్టెన్ చమరి ఆటపట్టు (44), హాసిని పెరెరా (39), నీలాక్షి డిసిల్వ (48) లు రాణించారు. కాని భారత బౌలర్ల దాటికి లంక 47.3ఓవర్లలో 216పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా భారత జట్టు 39 పరుగుల తేడాతో గెలుపొందింది. భారత బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్ 3 వికెట్లు, మేఘనా సింగ్, పూజా వస్త్రకార్ కు రెండేసి వికెట్లు పడగొట్టారు. దీప్తి శర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్, హర్లీన్ డియెల్ తలో వికెట్ తీశారు. జట్టును ముందుండి నడిపించిన హర్మన్‌ప్రీత్ కౌర్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మరియు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా దక్కింది.

- Advertisement -