శ్రీదేవి మరణంతో భారత చిత్ర పరిశ్రమ కన్నీరు పెట్టుకుంది. మరణించి రోజులు గడుస్తున్నా ఆమె ఎందుకు చనిపోయింది అనే విషయంపై క్లారిటీ రావడం లేదు. దీంతో శ్రీదేవి మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె మరణం సహజమా? అసహజమా? అనే విషయాన్ని తేల్చే పనిలో దుబాయ్ పోలీసులు నిమగ్నమయ్యారు. ఆమె మరణం అసహజమన్న కోణంలో విచారిస్తున్న పోలీసులు ఆమె భౌతికకాయానికి ఈ రోజు మరోసారి శవపరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో శ్రీదేవి మరణంపై బీజేపీ నేత, ప్రముఖ న్యాయవాది సుబ్రహ్మణ్యస్వామి అనేక అనుమానాలను వ్యక్తం చేశారు. ఆమెది హత్యే అని ఆయన ఆరోపిస్తున్నారు.
శ్రీదేవి తన ఆరోగ్యం పట్ల ఎల్లప్పుడూ జాగ్రత్త వహించేవారని ఆయన అన్నారు. ఎవరో ఆమెకు బలవంతంగా మద్యం తాగించి, స్నానాల తొట్టెలోకి తోసి చంపి ఉంటారనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. అయితే శ్రీదేవి మరణానికి సంబంధించి పబ్లిక్ ప్రాసిక్యూటర్ నివేదిక బయటకు వచ్చిన తర్వాతే దీనిపై మరింత స్పందించగలనని ఆయన చెబుతున్నారు.
మరోవైపు శ్రీదేవి భర్త బోనీ కపూర్‌ను నిన్న మూడు గంటల పాటు విచారించిన దుబాయ్ పోలీసులు ఈ రోజు కూడా విచారించినట్లు తెలిసింది. అలాగే ఆమె మొబైల్ ఫోన్ సంభాషణల రికార్డులను కూడా పోలీసులు విశ్లేషిస్తున్నారు. శ్రీదేవి మరణానికి సంబంధించి దుబాయ్ లో క్షణక్షణానికి పరిణామాలు మారిపోతుండటంతో ఆమె భౌతికకాయం ముంబైకి ఎప్పుడు చేరుకుంటుంది? అంత్యక్రియలు ఎప్పుడు జరుగుతాయి? అనే దానిపై నీలినీడలు కమ్ముకున్నాయి.