శ్రీరామ దివ్యక్షేత్రం భద్రాచలంలో శ్రీరాముడి పట్టాభిషేకం అత్యంత వైభవంగా జరిగింది. ప్రతి సంవత్సరం భద్రాద్రి క్షేత్రంలో 27 రోజుల పాటు కొనసాగిన రామాయణ పారాయణం పూర్తికాగానే పుష్యమినాడు శ్రీరామ పట్టాభిషేకం చేయడం ఆనవాయితీ. పుణ్యహవచనం, సమస్త నదీ, సముద్ర జలాలతో మంత్రోచ్ఛారణల మధ్య కలశాలను ఆవాహనం చేసి, శ్రీరామ పట్టాభిషేక మంత్ర సంపుటిత అష్టోత్తర శతనామార్చనను ఘనంగా నిర్వహించారు. మంగళవాయిద్యాల నడుమ, చతుర్వేద పారాయణం చేసి, వేద మంత్రోచ్ఛారణల నడుమ శ్రీరాముడికి కిరీట ధారణ, పట్టాభిషేకాన్ని వైభవోపేతంగా జరిపారు.
శ్రీరామ పట్టాభిషేకానికి రాష్ట్ర గవర్నర్ నర్సింహన్ దంపతులు హాజరయ్యారు. స్వామివారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. తొలుత గవర్నర్ రామాలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గవర్నర్కు ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికి పరివట్టం కట్టారు. గవర్నర్ నర్సింహన్ గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే శ్రీరామ మహా పట్టాభిషేకంలో వరుసగా ఆరు సార్లు పాల్గొన్న ఘనత రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దంపతులకు దక్కింది.
మిథిలా స్టేడియంలో జరిగిన శ్రీరామ పట్టాభిషేక మహోత్సవానికి భక్తులు వేలాది సంఖ్య లో తరలివచ్చారు. బుధవారం జరిగిన సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని తిలకించిన భక్తజనం భద్రాద్రిలోనే సేద తీరి, పట్టాభిషేకానికి తరలివచ్చారు. ఉదయమే పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి కల్యాణ మండపానికి చేరుకున్నారు. రామున్ని రామాలయం నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చే కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పట్టాభిషేకాన్ని కనులారా తిలకించిన పునీతులయ్యారు.