శ్రీలంకలో పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభుత్వం భారీగా పెంచింది. ఈ పెంపు అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంధన ధరలు పెరగడం, దేశ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
తాజా పెంపుతో ఆక్టేన్ 92 పెట్రోల్ ధర లీటరుకు రూ.24 పెరిగి ప్రస్తుతం రూ.317కు చేరింది. అలాగే ఆక్టేన్ 95 పెట్రోల్ ధరను రూ.25 పెంచడంతో ఇప్పుడు లీటరు ధర రూ.365గా ఉంది. ఆటో డీజిల్ ధరను రూ.22 పెంచగా, ప్రస్తుతం లీటరు రూ.303కు అమ్ముతున్నారు. సూపర్ డీజిల్ ధరను కూడా రూ.24 పెంచడంతో అది లీటరుకు రూ.353కు చేరింది.
ఇక కిరోసిన్ ధరను కూడా పెంచారు. లీటరుకు రూ.13 పెంపుతో కిరోసిన్ ధర ప్రస్తుతం రూ.195గా నిర్ణయించారు. ఈ ధరల పెంపుతో సాధారణ ప్రజలపై మరింత ఆర్థిక భారం పడే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. రవాణా ఖర్చులు పెరగడం వల్ల ఇతర వస్తువుల ధరలపై కూడా ప్రభావం ఉండొచ్చని భావిస్తున్నారు.
Also Read:మైత్రీ మూవీ మేకర్స్.. ‘జెట్లీ’ షూటింగ్ పూర్తి
ఇదిలా ఉండగా, ఇటీవలే పాకిస్తాన్ ప్రభుత్వం కూడా ఇంధన ధరలను భారీగా పెంచింది. అక్కడ పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.55 వరకు పెంచినట్లు ప్రకటించింది. దాంతో ఆ దేశంలో కూడా ఇంధన ధరల పెంపు ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరల పెరుగుదల కారణంగా పలు దేశాలు ధరలను పెంచుతున్నాయి.

