దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో ఎల్‌పీజీ కొరత కారణంగా హోటల్ రంగంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ముంబై హోటల్ అసోసియేషన్ అయిన Aahar తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటికే నగరంలోని సుమారు 20 శాతం హోటళ్లు తాత్కాలికంగా మూతపడ్డాయి. గ్యాస్ సరఫరా సమస్యలు కొనసాగితే వచ్చే రెండు నుంచి మూడు రోజుల్లో ఈ సంఖ్య 50 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.
హోటళ్లు ఎంతకాలం తెరిచి ఉంచగలవో వారి వద్ద ఉన్న ఎల్‌పీజీ నిల్వలపై ఆధారపడి ఉంటుందని ఆహార్ ప్రతినిధులు తెలిపారు. అయితే హోటళ్లను మూసివేయాలని అసోసియేషన్ ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదని, ప్రతి హోటల్ యజమాని తన పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు.
కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ల కొరత కారణంగా కేవలం ముంబైలోనే కాకుండా బెంగళూరు, కోల్‌కతా వంటి నగరాల్లో కూడా రెస్టారెంట్ల కార్యకలాపాలు దెబ్బతిన్నాయి. చాలా హోటళ్లు, రెస్టారెంట్లు రోజువారీ వంటకాలకు కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్లపై ఆధారపడటంతో సరఫరా అంతరాయం ఏర్పడితే వంటగదులు పూర్తిగా నిలిచిపోయే పరిస్థితి వస్తోంది.
Also Read:మైత్రీ మూవీ మేకర్స్.. ‘జెట్లీ’ షూటింగ్ పూర్తి
కమర్షియల్ ఎల్‌పీజీ సరఫరాదారులు అవసరమైన సిలిండర్లను అందించలేమని చెబుతున్నారని, దీనివల్ల రెస్టారెంట్ రంగం తీవ్రంగా ప్రభావితమవుతోందని పేర్కొంది. ఆహార సరఫరా వంటి కీలక సేవలపై ప్రభావం పడకుండా ప్రభుత్వం తక్షణ జోక్యం చేసుకోవాలని ఎన్ఆర్ఏఐ విజ్ఞప్తి చేసింది.

