కొంతకాలంగా శ్రీవారి దర్శనానికి సంబంధించి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలపై గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా ఓ పోర్టల్ రూపొందించారు. ఇకపై తెలంగాణ ప్రజా ప్రతినిధులు ఈ పోర్టల్ ద్వారా ఇచ్చిన లెటర్‌లను మాత్రమే అనుమతించనుంది.
ప్రజాప్రతినిధులు భక్తులకు ఇచ్చే వీఐపీ బ్రేక్ దర్శనం, రూ.300 ప్రత్యేక దర్శన టిక్కెట్లకు సంబంధించిన లేఖలన్నీ ఈ పోర్టల్ ద్వారానే సమర్పించాలి. ఈ విషయాన్ని టీటీడీ అధికారులు అధికారికంగా ప్రకటించారు. భక్తుల సౌకర్యార్థం తెలంగాణ ప్రభుత్వం ఈ పోర్టల్‌ను ప్రజాప్రతినిధులకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.
ప్రజాప్రతినిధులు సిఫార్సు లేఖలపై సంతకం చేసిన తర్వాత స్కాన్ చేసి ఈ పోర్టల్ లో అప్లోడ్ చేయాలి. అనంతరం భక్తులకు అసలు లేఖను అందజేయాలి. ఈ విధానం ద్వారా ప్రజాప్రతినిధులు ఇచ్చే లేఖలకు ఓ సమర్థమైన విధానం నెలకొంటుందని టీటీడీ అధికారులు తెలిపారు. పోర్టల్‌లో అప్లోడ్ కాని లేఖలను టీటీడీ అనుమతించదని అధికారులు తెలిపారు.


