దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా పలు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో ఓట్లను జాబితా నుంచి తొలగించింది. ఈ క్రమంలో తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలకు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాలను విడుదల చేసింది.
ఎన్నికల సంఘం ప్రకటించిన వివరాల ప్రకారం, ఒక్క తమిళనాడులోనే సుమారు 97.37 లక్షల ఓట్లను తొలగించినట్లు వెల్లడించింది. అలాగే గుజరాత్ రాష్ట్రంలో దాదాపు 73 లక్షల ఓట్లకు కోత విధించినట్లు తెలిపింది. మరణించిన ఓటర్లు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినవారు, డూప్లికేట్ ఓట్లను గుర్తించి తొలగించే ప్రక్రియలో భాగంగానే ఈ చర్యలు తీసుకున్నట్లు ఈసీ స్పష్టం చేసింది.
అయితే ఓట్ల తొలగింపు అంశం రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీసింది. ముఖ్యంగా తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్ నియోజకవర్గంలోనే లక్షకు పైగా ఓట్లు జాబితా నుంచి గల్లంతైనట్లు వెలుగులోకి రావడంతో ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ స్థాయిలో ఓట్ల తొలగింపు వెనుక స్పష్టత కావాలని డిమాండ్ చేస్తున్నాయి.
ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు, సవరణలకు ఎన్నికల సంఘం గడువు ఇచ్చింది. అర్హులైన ఒక్క ఓటరు కూడా హక్కు కోల్పోకుండా తగిన ఆధారాలతో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక తుది ఓటర్ల జాబితా విడుదల చేయనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
Also Read:MSG:చిరంజీవి ఎక్స్‌క్లూజివ్ స్టిల్

