ప్రణయ్‌ హత్య కేసులో 7గురు అరెస్ట్

359
sp ranganath
- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసును నాలుగు రోజుల్లో ఛేదించారు నల్గొండ జిల్లా పోలీసులు. ఈ కేసులో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశామని ఎస్పీ రంగనాథ్ తెలిపారు. మంగళవారం మీడియా సమావేశంలో నిందితులను ప్రవేశపెట్టారు. అనంతరం మాట్లాడిన ఆయన కూతురిపై ప్రేమే ప్రణయ్ హత్యకు కారణమని తెలిపారు.

మూడు నెలల క్రితమే ప్రణయ్ హత్యకు ప్లాన్ వేశారని తెలిపారు. ప్రణయ్ హత్యకు నిందితులు ప్రణయ్‌ హత్యకు తొలుత రెండున్నర కోట్ల రూపాయలు సుపారీ అడిగారని… చివరకు మారుతీరావు కోటి రూపాయలకు కాంట్రాక్టు కదుర్చుకున్నాడని వెల్లడించారు. మారుతీరావు నుంచి రూ. 15 లక్షలు అడ్వాన్స్ తీసుకున్న తర్వాత అస్గర్ అలీ, అబ్దుల్ బారీ స్కెచ్ వేశారని తెలిపారు. ఈ మొత్తంలో రూ. 8 లక్షలు బారీ, రూ. 6 లక్షలు అస్గర్, లక్ష రూపాయలు కరీం తీసుకున్నారని వెల్లడించారు. మర్డర్ ప్లాన్ అమలుకు మూడు సిమ్ కార్డులు కొన్నారని చెప్పారు.

ఆగస్టు 9వ తేదీ రెక్కీ జరిగిందని మిర్యాలగూడలోని బ్యూటీ పార్లర్ వద్ద ఆగస్టు 14న చంపేప్రయత్నం చేశారని..ఆగస్టు 17న వెడ్డింగ్ రిసెప్షన్‌ను టార్గెట్ చేశారన్నారు. తర్వాత ఆగస్టు 22న ప్రణయ్ ఇంటివద్దే హ్యత చేసేందుకు విఫలయత్నం చేశారని చివరకు సెప్టెంబర్ 14న ప్రణయ్‌ని హతమార్చారని వెల్లడించారు. ప్రణయ్‌ని చంపింది బీహార్‌కు చెందిన సుభాష్‌ శర్మ అని తెలిపారు.

ఈ కేసులో ఏ1 – మారుతీ రావు (అమృత తండ్రి), ఏ2 – సుభాష్ శర్మ (బీహార్), ఏ3 – అస్గర్ అలీ, ఏ4 – మహ్మద్ బారీ, ఏ5 – అబ్దుల్ కరీం, ఏ6 – శ్రవణ్ (బాబాయ్), ఏ7 – సముద్రాల శివగౌడ్ (డ్రైవర్) నిందితులని వెల్లడించారు.

ప్రణయ్ హత్య కేసుతో ప్రజాప్రతినిధులెవరికీ సంబంధం లేదని రంగనాథ్ స్పష్టం చేశారు. ప్రణయ్ హత్య కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేశామని… ఏ కాల్‌డేటా పరిశీలించినా నేతల ప్రమేయం లేదని తేలిందని చెప్పారు. ప్రణయ్ హత్య కేసు వ్యక్తిగత కోణంలో జరిగిందేనన్నారు. ఈ కేసులో నయీం ముఠా హస్తం ఉన్నట్లు వస్తున్న ఆరోపణల్లో నిజంలేదన్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేయవద్దని సూచించారు.

- Advertisement -