వర్షాకాలం వచ్చిందోచ్‌..

233
monsoon

మండు వేసవిలో చల్లని కబురు! అనుకున్న దానికంటే ముందుగానే నైరుతి రుతుపవనాలు మంగళవారం కేరళను తాకినట్లు భారత వాతావరణశాఖ (ఐఎండీ) తెలిపింది. వచ్చే 48 గంటల్లో ఇవి కేరళలోని మిగతా ప్రాంతాలతోపాటు.. కర్ణాటక మధ్య, తీర ప్రాంతాలకూ, బంగాళాఖాతంలోని తూర్పు, మధ్య, ఈశాన్య ప్రాంతాలకూ విస్తరించే అవకాశముందని తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా ఇక వానాకాలం ఆరంభమైనట్లేనని వాతావరణశాఖ వర్గాలు తెలిపాయి. నిరుడు మే, 30న రుతుపవనాలు కేరళను తాకగా, ఈసారి దానికి ఒకరోజు ముందుగానే చేరుకోవడం విశేషం.

monsoon

రుతుపవనాల రాకతో కేరళ, కర్ణాటక, లక్షద్వీప్‌, అండమాన్‌ నికోబార్‌ దీవులు, నాగాలాండ్‌, మణిపూర్‌, మిజోరాం, త్రిపురల్లో అక్కడక్కడా బుధవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు. ఈ ఏడాది వర్షాలు ‘సాధారణ స్థాయి’లో ఉంటాయని ఇప్పటికే ఆ సంస్థ అంచనా వేసింది. మరోవైపు జూన్‌ 7 నాటికి తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశించి వర్షాలు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు వివరించారు.

రాష్ట్రంలో భానుడి భగభగలతో జనం విలవిల్లాడుతున్నారు. వేడిగాలుల తీవ్రతతో మధ్యాహ్నవేళల్లో ఇండ్ల నుంచి బయటికి వచ్చేందుకు సాహసం చేయడం లేదు. మరో నాలుగు రోజులపాటు ఎండల తీవ్రత ఇదేస్థాయిలో కొనసాగే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కేరళలో నైరుతి రుతుపవనాలతో వర్షాలు ప్రారంభమైనా, వాటి ప్రభావం మరో వారం వరకు తెలంగాణపై ఉండే అవకాశం లేదని అధికారులు స్పష్టంచేశారు. అప్పటి వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల నుంచి 45 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. టీఎస్‌డీఎస్ నివేదిక ప్రకారం మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నల్లగొండ జిల్లా నిడమనూరులో అత్యధికంగా 45.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

summer

నిడమనూరు మండలం తుమ్మడంలో 45.3 డిగ్రీలు, త్రిపురారం మండలం కామారెడ్డిగూడెంలో 45.2 డిగ్రీలు, మిర్యాలగూడ మండలం తడకమళ్ల, చండూరు మండలం పుల్లెములలో 45.1 డిగ్రీలు నమోదైంది. మంచిర్యాల జిల్లాలో 44.9 డిగ్రీలు, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో 44.8 డిగ్రీలు, సూర్యాపేట, ఆదిలాబాద్ జిల్లాల్లో 44.7 డిగ్రీలు, పెద్దపల్లి జిల్లాలో 44.6 డిగ్రీలు, కుమ్రంభీం ఆసిఫాబాద్, జగిత్యాల జిల్లాల్లో 44.5 డిగ్రీలు, రాజన్న సిరిసిల్ల, జనగామ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 44.4 డిగ్రీలు, వరంగల్(అర్బన్), నిర్మల్, వరంగల్(రూరల్), జయశంకర్‌భూపాలపల్లి జిల్లాల్లో 43.3 డిగ్రీలు, యాదాద్రి భువనగరి, నాగర్‌కర్నూల్, నిజామాబాద్ జిల్లాల్లో 43.9 డిగ్రీలు, మహబూబ్‌నగర్, సిద్దిపేట, రంగారెడ్డి, వికారాబాద్, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, వనపర్తి, జోగుళాంబగద్వాల జిల్లాల్లో 43 డిగ్రీలు, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో 42.9 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.