దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను కైవసం చేసుకుంది భారత్. నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో సఫారీలను చిత్తు చేశారు భారత బౌలర్లు. తొలి రెండు వన్డేల్లో భారీ స్కోరు సాధించిన దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ మూడో వన్డేలో చేతులెత్తేశారు. కేవలం 99 పరుగులకే ఆలౌట్ అయ్యారు. ఇక 100 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత ఆటగాళ్లు ఆడుతూపాడుతూ విజయాన్ని నమోదుచేశారు. 19.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. శుభమన్ గిల్ (57 బంతుల్లో 49 పరుగులు), శ్రేయస్ అయ్యర్ (23 బంతుల్లో 28 పరుగులు) రాణించారు.
అంతకముందు బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 27.1 ఓవర్లలో 99 పరుగులకే కుప్పకూలింది. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు పడగొట్టాడు. దక్షిణాఫ్రికా జట్టులో హెన్రిచ్ క్లాసెన్ చేసిన 34 పరుగులే అత్యధికం. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై భారత బౌలర్లు అద్భుతంగా రాణించి ఘనవిజయాన్ని అందించారు.