సూపర్ స్టార్ రజనీకాంత్ చిన్న కూతురు సౌందర్య రజినీకాంత్ ఈ మద్య వార్తల్లో పదే పదే వస్తుంది. సౌందర్య విడాకులు తీసుకోబోతోందంటూ కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు వచ్చాయి..అయితే వీటిపై ఆమె క్లారిటీ ఇస్తూ.. స్వయంగా సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని ధృవీకరించింది.
ఏడాది కాలంగా భర్తకు దూరంగా ఉంటున్నానని..వ్యక్తిగత విషయాల్లో తమ కుటుంబ గోప్యత విషయంలో సంయమనం పాటించాలని మీడియాను కోరారు. తాజాగా మరో వివాదంలో సౌందర్య చిక్కుకున్నారు. సౌందర్యకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తూ ఆమె చిత్రపటాలను దహనం చేస్తున్నారు వీరవిళ్లైయాట్టు మీట్పు కళగం నిర్వాహకులు.
ఇంతకు సౌందర్య దిష్టిబొమ్మలను ఎందుకు తగులబెడుతున్నారంటే.. సౌందర్యరజనీకాంత్‌ను భారత దేశం యానిమల్ వెల్ఫేర్ బోర్డు అంబాసిడర్‌గా నియమించిన విషయం తెలిసిందే. సౌందర్యరజనీకాంత్ ఆ బాధ్యతలను చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ తిరుచ్చిలో వీరవిళైయాట్టు మీట్పు కళగం నిర్వాహకులు మంగళవారం ఆందోళనకు దిగారు.సౌందర్యరజనీకాంత్ చిత్ర పటాలను దహనం చేసి ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఆ ప్రాంతంలో కలకలం చెలరేగింది.
అయితే అక్కడి పోలీసులు సౌందర్య రజనీకాంత్ చిత్ర పటాలు దహనం చేయడాన్ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వీరవిళైయాట్టు మీట్పు కళకం నిర్వాహకుడు రాజేశ్ మాట్లాడుతూ సౌందర్య రజనీకాంత్‌ను యానిమల్ వెల్ఫేర్ బోర్డు అంబాసిడర్‌గా నియమించడాన్ని జల్లికట్టును ఆదరించేవాళ్లు, తమిళ ప్రజల మనసులను తీవ్రంగా గాయపరిచిందన్నారు. జల్లికట్టు నిషేధానికి కారణంగా నిలిచిన యానిమల్ వెల్ఫేర్ బోర్డుకు అంబాసిడర్‌గా సౌందర్య రజనీకాంత్‌ను ఎంపిక చేయడం ఖండించతగ్గ విషయంగా పేర్కొన్నారు.
అంతే కాకుండా తమిళ చిత్రాల్లో నటించి డబ్బు సంపాదించుకున్న కొందరు నటీనటులు జల్లికట్టుకు వ్యతిరేకంగా మాట్లాడడం గర్హనీయం అన్నారు. నటుడు రజనీకాంత్ మురట్టుకాళై చిత్రంలో జల్లికట్టు అంబోతుతో పోరాడి గెలిచినట్లు నటించి తమిళ ప్రజల మనసులో చోటు సంపాదించుకున్నారన్నారు. రజనీకాంత్ ఈ విషయంలో కలగజేసుకుని యానిమల్ వెల్ఫేర్ బోర్డు అంబాసిడర్‌గా నియమితులైన తన కూతురు సౌందర్యరజనీకాంత్‌ను ఆ బాధ్యతనుంచి వైదొలిగేలా చేయాలని లేని పక్షంలో ఆయనకు వ్యతరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నట్లు పేర్కొన్నారు.