తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై ప్రశంసలు గుప్పించారు జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్. మంత్రి హరీష్ రావుతో కలిసి మహదేవపూర్ మండలం మేడిగడ్డ బరాజ్‌ను సందర్శించిన ఆయన ప్రాజెక్టు పూర్తయితే రైతుల బ్రతుకులు బాగుపడతాయన్నారు. ఈ ప్రాజెక్టు తెలంగాణ ప్రజల వరం..రైతులకు వరప్రదాయనిగా మారనుందన్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పనుల వివరాలను మంత్రి హరీష్…సోరెన్‌కు వివరించారు.
నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఉద్యమం సాగుతున్న సమయంలో ఏపల్లెలో ఏగడప దట్టిన వినిపించిన పాటలు..గోదారి గోదారి పారేటి గోదారి..చుట్టు నీళ్లు ఉన్న చుక్క దొరకని ఎడారి ఈ భూమి..మాది తెలంగాణ భూమి. తలపున పారుతుంది గోదారి..మా చేను మా చెలక ఏడారి. తెలంగాణకు నీళ్ల విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఎన్నోపాటలు బాణంలా నిలిచాయి.
ఈ నేపథ్యంలో తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చడానికి సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ని చేపట్టారు. ఇందులో భాగంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం. ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ సస్యశ్యామలం కానుంది. 2018 డిసెంబర్ నాటికి కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేయాలనే సంకల్పంతో ప్రభుత్వం,అధికారులు అహర్నిషలు శ్రమిస్తున్నారు.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా 18.25 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించడంతోపాటు మరో 18.82 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని మేడిగడ్డ వద్ద 3 టీఎంసీల నీటిని తరలించేలా సివిల్ పనులు జరుగుతుండగా, ప్రస్తుతం 2 టీఎంసీలు తీసుకునేలా మోటార్ల బిగింపు కొనసాగుతోంది.
జూన్ నాటికి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పనులను పూర్తి చేసి రోజుకు ఒక టీఎంసీ చొప్పున 90 రోజులపాటు 90 టీఎంసీలను ఎత్తిపోయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. దీనికి తగ్గట్లే పనులపై ముఖ్యమంత్రి కేసీఆర్ తన కార్యాలయం నుంచే పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు సూచనలిస్తున్నారు. వర్షాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి లేకుండానే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు రైతన్నలకు వరప్రదయినిగా మారనున్నాయి.