కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వ్యాక్సిన్ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తప్పుపట్టారు. ఆ విధానం అసంబద్ధంగా ఉందని, వివక్షపూరితంగా ఉన్నట్లు ఆమె ఆరోపించారు. తాజాగా ఇదే విషయంపై ప్రధాని మోదీకి సోనియా గాంధీ లేఖ రాశారు. వ్యాక్సిన్ ధరల విధానం వివక్షపూరితంగా ఉందని చెప్పారు. వ్యాక్సిన్ ధరల విధానాన్ని పునఃసమీక్షించుకోవాలని కోరారు.
పౌరులకు ఉచిత వ్యాక్సిన్ అందించాలన్న అంశం నుంచి కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేసినట్లుందని ఆమె పేర్కొన్నారు. ఒకే దేశంలో ఒకే వ్యాక్సిన్‌ను వేర్వేరు ధరలకు అమ్మడం ఏంటని ఆమె ప్రశ్నించారు. దీనిపై మోదీ జోక్యం చేసుకోవాలని, సీరం నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చర్యలు చేపట్టాలని ఆమె అన్నారు.
దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ 18 ఏళ్ల వయసు నిండిన వారందరికీ వ్యాక్సిన్లు ఇవ్వాలన్న లక్ష్యం ఉండాలని ఆమె చెప్పారు. కాగా, కొవిషీల్డ్ వ్యాక్సిన్ ధరలను సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఐ) నిన్న ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాక్సిన్ డోసును కేంద్రానికి రూ.150కి, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.400కు, ప్రైవేటు ఆసుపత్రులకు రూ.600గా ఉంటుందని పేర్కొంది.