కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ తన ఆత్మకథ ‘Belonging: A Journey of Love’లో రాజకీయాల్లోకి రావడానికి దారితీసిన పరిస్థితులను వివరించారు. భర్త రాజీవ్ గాంధీ హత్య తర్వాత రాజకీయాలకు దూరంగా ఉండాలని భావించినప్పటికీ.. చివరకు పార్టీ, దేశం పట్ల తనకున్న బాధ్యత కారణంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టాల్సి వచ్చిందని వెల్లడించారు. రాజకీయాల్లోకి రావాలనే నిర్ణయం వెనుక ఉన్న అంతర్మథనాన్ని పుస్తకంలో ప్రస్తావించారు.
రాజీవ్ గాంధీ మరణం తర్వాత తాను చాలాకాలం ఏకాంత జీవితానికే పరిమితమయ్యానని సోనియా తెలిపారు. అయితే 1990వ దశకం చివర్లో కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు రాజీవ్ గాంధీతో కలిసి పనిచేసిన పలువురు నేతలు తనను కలుస్తూ పార్టీ వ్యవహారాల్లో చురుకుగా పాల్గొనాలని కోరేవారని పేర్కొన్నారు.
తన పిల్లలు రాహుల్, ప్రియాంక మాత్రం రాజకీయాల్లోకి రావద్దని తీవ్రంగా వ్యతిరేకించారని సోనియా గుర్తుచేసుకున్నారు. ఇప్పటికే నానమ్మ ఇందిరాగాంధీ, తండ్రి రాజీవ్ గాంధీని కోల్పోయిన వారు.. తనను కూడా రాజకీయాల్లోకి వెళ్లి ప్రమాదంలో పడవద్దని కోరినట్లు వివరించారు. రాజకీయాల్లోని అధికారం, ఆశ, దురాశ, కపటం, కుట్రలంటే తనకు మొదటి నుంచీ ఇష్టం లేదని తెలిపారు.
రాజకీయాల్లోకి రావాలా? వద్దా? అనే సందిగ్ధంలో ఉన్న సమయంలో భగవద్గీతను ఆశ్రయించినట్లు సోనియా వెల్లడించారు. 1997 జనవరి నుంచి సంస్కృతంలో ఉన్న భగవద్గీతను హిందీ, ఇంగ్లిష్ అనువాదాలతో చదవడం ప్రారంభించినట్లు తెలిపారు. శాస్త్రిజీ అనే వ్యక్తి గీతలోని శ్లోకాలను చదివి వాటి అర్థాన్ని వివరించేవారని పేర్కొన్నారు. కృష్ణుడు అర్జునుడికి చెప్పిన ఫలితాన్ని ఆశించకుండా నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు అనే సందేశం తనపై ప్రభావం చూపిందని సోనియా రాశారు. ఆ సందేశం తనలో కొత్త ఆలోచనను కలిగించిందని, తన సందేహాలకు సమాధానం లభించిందని వివరించారు.
Also Read:అనీష్కి సినిమా అంటే ప్రాణం!
తన రాజకీయ ప్రవేశానికి మరో కారణాన్ని కూడా సోనియా వివరించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్, వాటికి అనుబంధంగా ఉన్న సంస్థల రాజకీయ విధానాల వల్ల మతాల మధ్య ఘర్షణలు పెరిగే ప్రమాదం ఉందని తాను భావించినట్లు పేర్కొన్నారు. రాజ్యాంగ విలువలకు విఘాతం కలగకుండా చూడాలనే ఆలోచన తనను రాజకీయాల్లోకి అడుగుపెట్టేలా చేసిందని వెల్లడించారు. దేశానికి బలమైన, సమర్థవంతమైన పాలనతో పాటు అభివృద్ధి, ప్రగతి అవసరమని తాను భావించినట్లు తెలిపారు. తన కుటుంబం చేసిన త్యాగాలు, దేశం పట్ల ఉన్న బాధ్యతను దృష్టిలో ఉంచుకుని రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నట్లు సోనియా తన ఆత్మకథలో వివరించారు.

