ఉగ్రవాదుల్ని నియంత్రించే విషయంలో ఆయా దేశాలు తీసుకునే చర్యలు ఒక ఎత్తు అయితే.. అందులో భాగంగా జరిగే తప్పులు కొన్ని దారుణమైన ఫలితాలకు దారి తీస్తాయి. తాజాగా అలాంటి ఉదంతమే సోమాలియాలో చోటు చేసుకుంది. ఉగ్రవాద సమస్యను తీవ్రంగా ఎదుర్కొంటున్న ఆదేశంలో భద్రతాదళాలు చేసిన పొరపాటుపై ఇప్పుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ఉగ్రవాదనుకుని సొమాలియా భద్రతాబలగాలు ఓ మంత్రిని కాల్చి చంపాయి. సొమాలియాకి చెందిన అబ్బాస్ సిరాజీ అనే మంత్రి రాజధాని మొగాదిషులో బుధవారం కారులో పని నిమిత్తం వెళుతున్నారు. ఇంతలో భద్రతా బలగాలు కారులో వెళుతున్నది అనుమానిత ఉగ్రవాదనుకుని కాల్పులు జరిపారు. దాంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు.
సొమాలియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొగాదిషులో ఆల్‌ఖైదా ఉగ్రవాదులు ఎక్కువగా దాడులకు పాల్పడుతుంటారు. ఈ నేపథ్యంలో భద్రతా బలగాలు ఉగ్రవాదులనుకుని మంత్రిపై కాల్పులకు పాల్పడినట్లు ప్రతినిధులు తెలిపారు. దేశంలో అతి చిన్న వయస్కుడైన మంత్రి అబ్బాస్ అబ్దుల్లాహి షేక్ (31) రెండు నెలల క్రితమే మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.భద్రతా ఇవ్వాల్సిన వాళ్లే మంత్రిని కాల్చి చంపడమేంటని అక్కడి ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. కాగా, మంత్రిని కాల్చి చంపిన ఇద్దరు సైనికులను అరెస్ట్ చేశారు.