స్పీకర్ తీర్పుపై తీవ్రంగా స్పందించారు బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ సోమ భరత్ కుమార్. ఎమ్మెల్యేల అనర్హత అంశంలో స్పీకర్ వ్యవస్థకు ఉండాల్సిన న్యాయబద్ధమైన విచక్షణ పాటించలేదని ఆయన విమర్శించారు. ముఖ్యంగా దానం నాగేందర్, కడియం శ్రీహరి వ్యవహారంపై తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్యానికి దెబ్బతీసిందని అన్నారు.
దానం నాగేందర్, కడియం శ్రీహరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా కొనసాగుతూనే కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని, ఆ పార్టీకి బహిరంగంగా మద్దతు ప్రకటించారని ఆయన పేర్కొన్నారు. దానం నాగేందర్ అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ పార్టీ బీ ఫారం మీద ఎంపీగా పోటీ చేశారని గుర్తుచేశారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల కమిషన్‌కు అఫిడవిట్ కూడా సమర్పించారని తెలిపారు.
ఈ పరిస్థితుల్లో కూడా స్పీకర్ వారిని అనర్హులుగా ప్రకటించకుండా క్లీన్ చిట్ ఇవ్వడం అత్యంత దురదృష్టకరమని సోమ భరత్ అన్నారు. స్పష్టమైన ఆధారాలు, సాక్ష్యాలు ఉన్నప్పటికీ వాటిని పక్కన పెట్టి ఇలాంటి తీర్పు ఇవ్వడం స్పీకర్ అత్యంత దుర్మార్గంగా వ్యవహరించినట్టేనని విమర్శించారు. దేశంలో ఇలాంటి తీర్పు ఎప్పుడూ చూడలేదని ఆయన అన్నారు.
పార్టీ ఫిరాయింపులను అరికట్టేందుకు రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన చట్టానికే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తూట్లు పొడుస్తోందని ఆరోపించారు. దీనిపై రాహుల్ గాంధీ సిగ్గుపడాలని, తన తండ్రి తీసుకొచ్చిన చట్టానికి ఇదే గౌరవమా అని ప్రశ్నించారు.
Also Read:గ్యాస్ కొరత..ఈ ఫుడ్స్ పెట్టలేం!
ఈ తీర్పు కాంగ్రెస్ పార్టీ చరిత్రలో చెడు పేజీగా నిలుస్తుందని సోమ భరత్ వ్యాఖ్యానించారు. ఈ అంశంపై భవిష్యత్తులో పార్టీ అధినేత కేసీఆర్‌తో చర్చించి హైకోర్టును ఆశ్రయించే అంశాన్ని పరిశీలిస్తామని ఆయన వెల్లడించారు.

