బిఆర్ఎస్ ఎంపీ కే.ఆర్. సురేష్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపుల అంశంపై కాంగ్రెస్ కేంద్ర నాయకులు, ముఖ్యంగా రాహుల్ గాంధీ రాజ్యాంగంలో మార్పులు అవసరమని చెబుతున్నప్పటికీ, తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ ఇచ్చిన తీర్పు నవ్వుల పాలవుతుందని ఆయన అన్నారు. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీకి వెళ్లి, అక్కడి నుంచి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఘటనలు బహిరంగంగానే జరిగాయని పేర్కొన్నారు. ఇలాంటి తీర్పులు ప్రజాస్వామ్యానికి మంచివి కావని, స్పీకర్ నిర్ణయంపై అన్ని అవకాశాలను వినియోగిస్తూ జ్యుడిషియల్ రివ్యూకు వెళ్తామని తెలిపారు. ఈ అంశాన్ని పార్లమెంట్‌లో కూడా లేవనెత్తుతామని, స్పీకర్‌పై భారీ ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు.
అదే సమయంలో నిన్న లోక్‌సభలో టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు చేసిన వ్యాఖ్యలపై కూడా సురేష్ రెడ్డి స్పందించారు. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతున్న సమయంలో అసలు అంశాన్ని పక్కనపెట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన బిల్లు పాసింగ్‌పై అభ్యంతరం తెలపడం ఖండనీయమని అన్నారు. దీనిపై తమ పార్టీ నిరసన వ్యక్తం చేస్తోందన్నారు.
Also Read:గ్యాస్ కొరత..ఈ ఫుడ్స్ పెట్టలేం!
తెలంగాణ ఏర్పాటుకు 12 సంవత్సరాలు గడిచినా ఇంకా తమపై కోపం చూపించడం ఆశ్చర్యంగా ఉందని పేర్కొన్నారు. ప్రాంతాలవారీగా విడిపోయినా పరస్పరం కలిసే ఉంటామని అప్పట్లోనే కెసిఆర్ స్పష్టం చేశారని గుర్తుచేశారు. పార్లమెంట్‌లో ఆమోదం పొందిన తెలంగాణ బిల్లును ఇప్పుడు వ్యతిరేకించడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. దీనిని అప్రజాస్వామికం అంటున్న వ్యాఖ్యలు అత్యంత బాధాకరమని, దీని వెనుక కుట్ర లేదా అనుమానం ఉందనే భావన కలుగుతోందన్నారు. ఈ విషయంలో టీడీపీ నాయకులు స్పందించకపోవడం కూడా అనుమానాలకు దారి తీస్తోందని పేర్కొన్నారు. తెలంగాణ పునర్విభజన చట్టం పూర్తి స్థాయిలో అమలు కావడానికి తమ పోరాటం కొనసాగుతుందని వెల్లడించారు.

