TTD:వేడుక‌గా స్నపనతిరుమంజనం

49
- Advertisement -

తిరుచానూరు  పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండ‌వ‌ రోజైన శనివారం అమ్మవారికి స్నపన తిరుమంజనం శోభాయమానంగా జరిగింది. మధ్యాహ్నం 12.30 నుండి 2.30 గంటల వరకు ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో ప్రత్యేకంగా ఫల పుష్పాలతో రూపొందించిన మండపంలో పాంచరాత్ర ఆగమశాస్త్రబద్ధంగా ఈ వేడుక వైభవంగా జరిగింది.

కంకణభట్టర్‌ శ్రీ మణికంఠ బట్టర్ ఆధ్వర్యంలో ఈ కార్య‌క్ర‌మం జరిగింది. ఇందులో ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, నవకలశాభిషేకం, రాజోపచారం నిర్వహించారు. అనంతరం ఛత్ర చామర, వ్యజన దర్పణాది నైవేద్యం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం చేపట్టారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. శంఖధార, చక్రధార, సహస్రధార, మహాకుంభాభిషేకాలను నిర్వహించారు.

ఈ సందర్భంగా తైత్తరీయ ఉపనిషత్తు, పురుషసూక్తం, శ్రీప్రశ్నసంహిత మంత్రాలను అర్చకులు పఠించారు. ఈ వేడుకలో ఒకో క్రతువులో ఒక మాల వంతున ఏడు రకాల మాలలను అమ్మవారికి అలంకరించారు. గుమ్మడి గింజలు, గోల్డ్ గ్రేప్స్, స్వీట్ కార్న్, సంపంగి మరియు వృచి, పింక్ రోజ్ పెటల్స్, తామ‌ర‌పూల గింజ‌లు, తులసి, రంగురాళ్ల‌తో కూడిన రోజామాలలు అమ్మవారికి అలంకరించారు.

Also Read:చెడుపై విజయమే… దీపావళి

స్నపనతిరుమంజనం నిర్వహించే శ్రీ కృష్ణముఖ మండపాన్ని వివిధ ర‌కాల సాంప్ర‌దాయ పుష్పాలు, క‌ట్ ఫ్ల‌వ‌ర్స్‌, అపురూపమైన పుష్పాలు, యాపిల్, ద్రాక్ష, , ఆస్ట్రేలియా ఆరంజ్ త‌దిత‌ర ఫ‌లాల‌తో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఈ మండపాన్ని 20 మంది టీటీడీ గార్డెన్‌ సిబ్బంది రెండు రోజుల పాటు శ్రమించి అలంకరించారు.శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలోని ధ్వజమండపం, గర్భాలయం, శ్రీకృష్ణస్వామివారి ఆలయం, శ్రీ సుందరరాజస్వామివారి ఆలయం, వాహనమండపం, ఆస్థానమండపం టీటీడీ గార్డెన్‌ విభాగం ఆధ్వర్యంలో వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. దాదాపు 70 మంది సిబ్బంది మూడు రోజుల పాటు శ్రమించి సుందరంగా అలంకరించారు.

- Advertisement -