దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో ఐపీఎల్‌కు కరోనా షాక్ తగిలింది. ఇప్పటికే ఒక్కొక్కరుగా ఆస్ట్రేలియా ప్లేయర్స్ లీగ్‌ను వీడి వెళ్లిపోతున్నారు. తాజాగా ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్స్ డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ కూడా తిరిగి వెళ్లిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇండియా నుంచి వచ్చే విమానాలపై ఆస్ట్రేలియా నిషేధం విధించే అవకాశం ఉన్నదన్న వార్తల నేపథ్యంలో అంతకుముందే ఇంటికి వెళ్లిపోవాలని ఈ ఇద్దరు ప్లేయర్స్ భావిస్తున్నట్లు సమాచారం.
ఇప్పటికే ఆర్సీబీ నుంచి ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్‌సన్, రాజస్థాన్ రాయల్స్ నుంచి ఆండ్రూ టై తిరిగి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. కరోనా సెకండ్ నేపథ్యంలో ఇండియా నుంచి వచ్చే అన్ని విమానాలను నిలిపేయాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం భావిస్తున్నట్లు అక్కడి మీడియా చెబుతోంది. అది జరగక ముందే ఇంటికి వెళ్లిపోవాలని వార్నర్, స్మిత్ సహా ఇతర ఆస్ట్రేలియా ప్లేయర్స్ భావిస్తున్నారని న్యూస్ ఏజెన్సీ ఐఏఎన్ఎస్ వెల్లడించింది.