మంత్రి గారు.. హ్యాకథాన్‌లో తెలంగాణ ఎక్కడ..?

194
smart-india-hackathon17-hyd
- Advertisement -

కేంద్రీయ మానవ వనరుల శాఖ, యూజీసీ మరియు అఖిల భారత సాంకేతిక విద్యామండలి సంయుక్తంగా నిర్వహించే జాతీయ స్థాయి ప్రోగ్రామింగ్ సదస్సు, “స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన్ 2017″ను దేశవ్యాప్తంగా పలు నగరాల్లో నిర్వహించనున్నారు. ప్రపంచంలో జరిగే అతిపెద్ద హాకథాన్‌ అని ఇదేనని భారీగానే ప్రచారం చేశారు. ఏప్రిల్ 1, 2 తేదీల్లో జరిగే హాకథాన్‌లో 29 మంత్రిత్వ శాఖలకు చెందిన 598 సమస్యలపై 26 నగరాల్లో 36 గంటలపాటు సృజనాత్మక సాఫ్ట్‌వీరులు పరిష్కారాలు కనుగొంటారన్న లక్ష్యాన్ని పోస్టర్‌లో ప్రకటించారు. అయితే ఈ పోస్టర్‌లో మనదేశ మ్యాపులో తెలంగాణ మ్యాపు లేకుండా వేసి తప్పులో కాలేశారు. కేంద్ర మానవ వనరుల మంత్రి ప్రకాశ్ జవదేకర్ తన ట్విట్టర్‌లో విడుదల చేసిన హాకథాన్-17 పోస్టర్‌లో తెలంగాణ కనిపించకపోవడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

hackathon

తెలంగాణ మ్యాపు వేయకుండా ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రం మ్యాపు వేసి పక్కన హైదరాబాద్, గుంటూరు నగరాల పేర్లు ఇచ్చి ఊరుకున్నారు. దీనిపై ఎంపీ కవిత ట్విట్టర్‌లో ప్రశ్నను సంధించారు. హెచ్చార్డీ మంత్రిత్వశాఖ అధికారిక మ్యాపు ఇదేనా? అని నిలదీశారు. సామాజిక మాధ్యమాల్లో దీనిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రెండేండ్లు పూర్తి చేసుకొని మూడో ఏడాదివైపు పరుగులు పెడుతున్నా ఇంకా పాత మ్యాపులనే పట్టుకుని వేలాడటం ఏమిటో? అని నెటిజన్లు విమర్శిస్తున్నారు. మ్యాపు మార్చుకోమని ఎందరో హెచ్చార్డీ మంత్రిత్వశాఖకు, మంత్రి జవదేకర్‌కు సందేశాలు పంపినా స్పందించకపోవడంపై పలువురు మండిపడుతున్నారు. కేంద్రం తీరు హాస్యాస్పదమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

- Advertisement -