ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్‌ను చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల కమల్ ఓ వివాదంలో ఇరుక్కున్న విషయం తెలిసిందే. ఓ ప్రచారంలో మాట్లాడుతూ.. స్వతంత్ర భారత దేశంలో మొట్టమొదటి ఉగ్రవాది ఓ హిందూ అని, అతని పేరు నాథూరామ్ గాడ్సే అని అన్నారు. దీంతో కమల్‌పై సర్వత్రా నిరసనలు మొదలయ్యాయి. ఆయనపై చర్యలు తీసుకోవాలని పలు సంఘాలు డిమాండ్ చేశాయి. బీజేపీ శ్రేణులు కూడా కమల్ వ్యాఖ్యలని తప్పుబట్టాయి.
ఇదిలావుండగా.. కమల్ హాసన్ బుధవారం మదురై అసెంబ్లీ నియోజకర్గపరిధిలోని తిరుప్పరాన్‌కుంద్రమ్ లో ఎన్నికల ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో మాట్లాడుతుండగా కొందరు ఆయనపై చెప్పులతో దాడి చేశారు. అయితే అవి కమల్ వాహనానికి తగిలి కిందపడ్డాయి. ఈ ఘటనపై కమల్ అభిమానులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మొత్తం 11 మందిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరిలో భాజపా నేతలు, హనుమాన్ సేన సభ్యులు కూడా ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పటివరకు ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.