జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్‌పై గుర్తు తెలియని వ్యక్తి చెప్పుతో దాడి చేశాడు. తెలంగాణ యాత్రలో భాగంగా ఖమ్మంలో పర్యటిస్తున్న పవన్‌పై చెప్పువిసరడం కలకలం రేపింది. ఓపెన్ టాప్ కారులో అభివానులకు అభివాదం చేస్తూ వెళుతున్న పవన్ ని చూసేందుకు అభిమానులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఆయన వాహనం స్థానిక తల్లాడ సెంటర్ కు చేరుకున్న సమయంలో పవన్ అభిమానులు, పార్టీ కార్యకర్తలతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది.
ఆ సమూహంలో నుంచి ఓ గుర్తుతెలియని వ్యక్తి చెప్పు విసరడంతో ఆ చెప్పు పవన్ కారుపై పడింది. ఈ ఘటన అనంతరం అక్కడి ఏబీ గార్డెన్స్ లో ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల కార్యకర్తలతో పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. ఆ సమావేశంలో పవన్ ప్రసంగిస్తూ..తనపై దాడులు చేసినా ఎదురుదాడి చేయనని, ప్రజల కోసం ఏమైనా భరిస్తాని అన్నారు. జనసేన ఓటు బ్యాంకు రాజకీయాలు చేయదని, తనకు కులం, మతం లేదని, మానవత్వం, జాతీయతను గౌరవిస్తానని వెల్లడించారు. అంతేకాకుండా మన సమాజం కులవ్యవస్థతో ముడిపడి ఉందని, కులవ్యవస్థను కాదని రాజకీయాలను చేయలేమని స్పష్టం చేశారు.
2019 ఎన్నికల్లో అద్భుతాలు చేస్తామని చెప్పడం లేదని, కార్యకర్తలు సంక్షేమ హాస్టళ్ల స్థితిగతులు తెలుసుకోవాలని అన్నారు. ఈ క్రమంలోనే నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య తనను కదిలించిందని, ప్రజలకు అండగా నిలబడితే ఎందుకు విమర్శలు చేస్తారో తెలియడం లేదంటూ చెప్పుకొచ్చారు పవన్. కాగా..తాను పదవుల కోసం కాకుండా..సామాజిక మార్పు కోరుకుంటున్నానని, ప్రేమించేవాళ్లకు తప్ప.. ద్వేషించేవాళ్లకు సమయం ఇవ్వనని పవన్ అన్నారు