సీతా రామం…సుమంత్‌ ఫస్ట్ లుక్

21
sumanth
- Advertisement -

స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కథానాయకుడి గా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సీతా రామం’. దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో మృణాల్ ఠాకూర్ కథానాయికగా, రష్మిక మందన్న కీలక పాత్రలో యుద్ధ నేపధ్యంలో అందమైన ప్రేమకథగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం నుండి మరో బిగ్ సర్ ప్రైజ్ బయటికి వచ్చింది. ఈ చిత్రంలో హీరో సుమంత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. బ్రిగేడియర్ విష్ణు శర్మగా సుమంత్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు.

ఫస్ట్ లుక్ లో ప్రేక్షకులు మునుపెన్నడూ చూడని ఇంటెన్స్ లుక్ లో కనిపించారు సుమంత్. సాఫ్ట్, క్లాస్ పాత్రలలో కనిపించే సుమంత్ .. బ్రిగేడియర్ విష్ణు శర్మగా టెర్రిఫిక్ లుక్ లో కనిపించారు. ఆర్మీ దుస్తుల్లో మెలితిరిగిన మీసాలతో సీరియస్ గా చూస్తున్న సుమంత్ మేకోవర్ సరికొత్తగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో సుమంత్ పాత్ర చాలా కీలకంగా ఉండబోతుందని ఫస్ట్ లుక్ చూస్తే అర్ధమౌతుంది. ఈ సందర్భంగా వీడియోని కూడా విడుదల చేశారు మేకర్స్. ”కొన్ని యుద్ధాలు మొదలుపెట్టడం మాత్రమే మన చేతుల్లో వుంటుంది. ముగింపు కాదు. బ్రిగేడియర్ విష్ణు శర్మ… మద్రాస్ రెజిమెంట్” అని సుమంత్ చెప్పిన డైలాగ్ మరింత ఆసక్తికరంగా వుంది.

ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో సుమంత్ మాట్లాడుతూ.. పదహారేళ్ళ క్రితం సీతారాముల ప్రేమ కథగా ‘గోదావరి’ సినిమా చేశాను. అది క్లాసిక్ గా నిలిచింది. పదహారేళ్ళ తర్వాత ఇంకో సీతారాముల కథలో భాగంగా వుండటం అదృష్టంగా భావిస్తున్నాను. సీతారామం ఒక క్లాసిక్ ఎపిక్ చిత్రంగా నిలుస్తుంది. నా కెరీర్ లో మొదటి సపోర్టింగ్ రోల్. ఈ స్క్రిప్ట్ ని చాలా క్షుణ్ణంగా చదివాను. చాలా చోట్ల కన్నీళ్లు వచ్చాయి. నా పాత్రే కాదు ఈ సినిమాలో అన్నీ పాత్రలు చాలా కీలకంగా వుంటాయి. హీరో పాత్రలు చేస్తూ ఇలాంటి కీలకమైన పాత్రలు చేయాలనీ ఎప్పటినుండో అనుకుంటున్నాను. బ్రిగేడియర్ విష్ణు శర్మ చాలా భిన్నమైన పాత్ర. సవాల్ తో కూడినది. ఇలాంటి పాత్ర కోసం చాలా రోజులుగా ఎదురుచుస్తున్నాను. ఈ పాత్ర చేసే మంచి అవకాశం ఇచ్చినందుకు స్వప్న దత్, అశ్వినీదత్, దర్శకుడు హను గారికి కృతజ్ఞతలు. హీరో దుల్కర్ సల్మాన్ నా ఫేవరేట్ కో స్టార్. మంచి వ్యక్తి. సీతారామం షూటింగ్ ఒక మధురమైన జ్ఞాపకం. సినిమా ఆగస్ట్ 5 ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ క్లాసిక్ ఎపిక్ ని మీరంతా చూసి ఆనందించాలి” అని కోరారు.

టాలీవుడ్ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తుంది. నిజానికి ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్‌డేట్‌ సినీ అభిమానులను సర్ ప్రైజ్ చేస్తోంది. 1965 బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా టీజర్‌కి, పాటలకు కూడా అద్భుతమైన స్పందన వచ్చింది.

తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రానికి పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. ఆగస్ట్ 5న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా విలేఖరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు సుమంత్.

తొలిసారి ఒక సపోర్టింగ్ రోల్ చేస్తున్నారు కదా.. బ్రిగేడియర్ విష్ణు శర్మ పాత్రలో మీకు అంతలా నచ్చిన అంశాలు ఏమిటి ?

నెగిటివ్, సపోర్టింగ్ రోల్స్ చేస్తానని ఎప్పటినుండో చెబుతున్నాను. మంచి పాత్రలు ,అవకాశం కోసం ఎదురుచూశాను. బ్రిగేడియర్ విష్ణు శర్మ చాలా క్లిష్టమైన పాత్ర. చాలా కోణాలు వుంటాయి. కథకి చాలా కీలకమైన పాత్ర. స్క్రిప్ట్ మొత్తం చదివిన తర్వాత అద్భుతం అనిపించింది. ఇలాంటి పాత్రలు సాదారణంగా రావు. ఇది నెగిటివ్ పాత్ర కాదు. కానీ చాలా వైవిధ్యంగా వుంటుంది. ఒక సవాల్ తో కూడుకున్న పాత్ర. ఆ సవాల్ నచ్చే ఒప్పుకున్నా.

ఈ సినిమా తెలుగు, తమిళ్, హిందీ, మలయాళంలో విడుదలౌతుంది కదా.. మిగతా భాషల్లో ఇది మీకు ఇంట్రడ్యుసింగ్ సినిమా గా ఉపయోగపడుతుందని భావిస్తున్నారా ?

తప్పకుండా. ఈ సినిమా పాత్ర పరిచయానికి తమిళ్ లో నేనే డబ్బింగ్ చెప్పాను. మిగతా భాషల్లో కూడా ఈ చిత్రం నాకు ఉపయోగపడుతుందనే భావిస్తున్నా.

బ్రిగేడియర్ విష్ణు శర్మ లుక్ లో మీసాలతో మీ తాతగారిని గుర్తు చేస్తుంది. మీకు అలా అనిపించిందా ?

చిన్నప్పటి నుండి నాకు తాతగారి పోలికలు వున్నాయని అందరూ చెబుతారు. అది నా అదృష్టం. నేను మా అమ్మలా వుంటాను. మా అమ్మ మా తాతయ్యలా వుంటుంది. (నవ్వుతూ) . ఆయన పోలికలు రావడం నిజంగా నా అదృష్టం.

వైజయంతి మూవీస్ తో పని చేయడం ఎలా అనిపించింది ?

వైజయంతి మూవీస్ ఒక క్లాసిక్ ఎపిక్ బ్యానర్. అశ్వినీదత్ గారితో ఎప్పటినుండో పరిచయం,చనువు వుంది. దత్ గారు సినిమాలో నా రషెస్ చూసి మా నాన్నగారికి ఫోన్ చేసి అద్భుతంగా చేశాడని చెప్పారు. వైజయంతిలో పని చేయడం గొప్ప అనుభవం.

వెబ్ సిరిస్ ల ట్రెండ్ పెరిగిందికదా.. వెబ్ సిరిస్ చేసే ఆలోచన ఉందా ?

ఒక నటుడిగా అన్నీ చేయాలనీ వుంటుంది. కొన్ని ఆఫర్లు వచ్చాయి. అయితే మంచి అవకాశం చూస్తున్నాను. ఓటీటీలో భిన్నమైన కథలు చెప్పే అవకాశం వుంటుంది. సవాల్ తో కూడిన కథలు వుంటాయి. నాకు నచ్చిన కథ కుదిరిరితే తప్పకుండా చేస్తా.

తారాగణం: దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న, సుమంత్, గౌతమ్ మీనన్, ప్రకాష్ రాజ్ తదితరులు

సాంకేతిక విభాగం:

దర్శకత్వం: హను రాఘవపూడి

నిర్మాత: అశ్వినీదత్

బ్యానర్: స్వప్న సినిమా

సమర్పణ: వైజయంతీ మూవీస్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గీతా గౌతమ్

ఛాయాగ్రహణం : పీఎస్ వినోద్

సంగీతం: విశాల్ చంద్రశేఖర్

ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు

ప్రొడక్షన్ డిజైన్: సునీల్ బాబు

ఆర్ట్ డైరెక్టర్: వైష్ణవి రెడ్డి, అలీ

కాస్ట్యూమ్ డిజైనర్: శీతల్ శర్మ

పీఆర్వో : వంశీ-శేఖర్

- Advertisement -