తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠను రేపిన డేటా చౌర్యం కేసులో సిట్ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. మాదాపూర్ అయ్యప్ప సొసైటీ లోని ఐటీ గ్రిడ్ కార్యాలయాన్ని శుక్రవారం సీజ్ చేశారు. ఇప్పటికే కార్యాలయంలో పలు దఫాలుగా సోదాలు నిర్వహించిన అధికారులు కీలకసమాచారాన్ని సేకరించారు. పరారీలో ఉన్న ఐటీ గ్రిడ్ సీఈఓ అశోక్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఐటీ గ్రిడ్ సంస్థ దగ్గర ఏపీతో పాటు తెలంగాణ ఓటర్ల సమాచారం కూడా ఉండటంతో లోతైన దర్యాప్తు చేపట్టారు సిట్ అధికారి స్టీఫెన్ రవీంద్ర. సేవామిత్ర యాప్‌లో తెలంగాణకు సంబంధించిన డేటా ఎందుకు ఉందనే అంశం కూడా పరిశీలిస్తున్నామన్నారు. తెలంగాణకు సంబంధించిన వివరాలతో ఏం చేస్తారనే విషయం కూడా తెలుసుకోవాల్సి ఉందన్నారు.
పరారీలో ఉన్న అశోక్ అమరావతిలో ఉన్నా అమెరికాలో ఉన్న పట్టుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు.సేవామిత్ర ఫీచర్లను ఎందుకు తొలగించారనే విషయమై అశోక్‌ను విచారిస్తామని.. దోషి అని తేలితే కోర్టు ముందు ఉంచుతామన్నారు.