త్వరలో తెలంగాణలో కూడా ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ వెల్లడించారు. ఎస్‌ఐఆర్ ఇప్పటివరకు జరగని అన్ని రాష్ట్రాల్లో మూడో దశలో ఈ సర్వే చేపడతామని ఆయన స్పష్టం చేశారు. బిహార్‌లో ఎస్‌ఐఆర్ విజయవంతంగా పూర్తయ్యిందని, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. బిహార్‌లో చేపట్టిన విధానాన్ని ప్రామాణికంగా తీసుకుని తెలంగాణలోనూ బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌వోలు) సమగ్రంగా సర్వే నిర్వహించాలని ఆయన సూచించారు.
హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఆదివారం బీఎల్‌వోలతో సమావేశమైన సీఈసీ మాట్లాడుతూ, దేశ ఎన్నికల వ్యవస్థకు బీఎల్‌వోలే వెన్నెముక అని కొనియాడారు. భారత ఎన్నికల నిర్వహణను ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనిస్తోందని, బిహార్‌లో బీఎల్‌వోలు చేసిన కృషి దేశానికి మార్గనిర్దేశంగా నిలిచిందన్నారు. ఎస్‌ఐఆర్ పూర్తయ్యాక బిహార్‌లో 7.5 కోట్ల మంది ఓటర్లతో జాబితా విడుదల చేశామని, దీనిపై ఎలాంటి ఫిర్యాదులు రాలేదని చెప్పారు. అక్కడ ఎన్నికల అనంతరం ఈవీఎంలు, వీవీప్యాట్లపై కూడా అభ్యంతరాలు రాలేదని, రీపోలింగ్ లేదా రీకౌంటింగ్ అవసరం రాలేదని వివరించారు.
తెలంగాణలో సగటున 930 మంది ఓటర్లకు ఒక బీఎల్‌వో ఉంటారని, ఎస్‌ఐఆర్ ద్వారా మరణించినవారి పేర్లు, డూప్లికేట్ ఓట్లను గుర్తించి తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యాంగ పరిరక్షణలో బీఎల్‌వోలు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల నిర్వహణలో 1.80 కోట్ల మంది సిబ్బంది పని చేస్తున్నారని తెలిపారు.
బీఎల్‌వోలు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా, పట్టణ ప్రాంతాల్లో తక్కువ పోలింగ్‌కు ఓటర్ల నిరాసక్తతే కారణమన్నారు. వలస ఓటర్లు ఒకేచోట ఓటు హక్కు కలిగి ఉండాలని స్పష్టం చేశారు. బీఎల్‌వోల గౌరవ వేతనం రూ.6 వేల నుంచి రూ.12 వేల వరకు పెంచినట్లు వెల్లడించారు. ఆధార్ కార్డు కేవలం గుర్తింపు పత్రం మాత్రమేనని, పౌరసత్వానికి ఆధారం కాదని, ఓటరు నమోదులో అది ఒక ఎంపిక మాత్రమేనని జ్ఞానేశ్ కుమార్ స్పష్టం చేశారు.
Also Read:‘ధురంధర్’..ఓటీటీ డేట్ లాక్!
బిహార్‌లో ఇటీవల విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాలో 65 లక్షల పేర్లు తొలగించడంపై వచ్చిన విమర్శలను ప్రస్తావిస్తూ, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆ జాబితాను ప్రచురించినట్లు ఈసీ పేర్కొంది.

