రాబోయే వారం రోజులు క్లిష్ట కాలం- గాయ‌ని స్మిత‌

434
smitha
- Advertisement -

వ‌చ్చే వారం రోజులు మ‌న‌కు చాలా కీల‌క‌మైన‌వ‌నీ, వైర‌స్ బాగా వ్యాప్తి చెందడానికి అవ‌కాశం ఉన్న ఈ స‌మ‌యంలో అంద‌రూ బ‌య‌ట‌కు క‌ద‌ల‌కుండా ఎవ‌రింటిలో వారు సుర‌క్షితంగా ఉండాల‌ని ప్ర‌ముఖ గాయ‌ని స్మిత పిలుపునిచ్చారు. ప్ర‌స్తుత సంక్షోభ కాలంలో వ‌చ్చే వారం రోజులు ఎందుకు కీల‌క‌మో ఒక వీడియో సందేశం ద్వారా ఆమె తెలిపారు.

ఆమె మాట్లాడుతూ, “అంద‌రూ మీ ఇళ్ల‌ల్లో సుర‌క్షితంగా ఉన్నార‌ని ఆశిస్తున్నా. సెల్ఫ్‌ క్వారంటైన్‌లో తొలి ఐదు రోజులు నేను బాగానే ఎంజాయ్ చేశాను. నా హాబీలు.. క్లీనింగ్‌, కుకింగ్‌, మా అమ్మాయి శివితో గ‌డ‌ప‌డం.. అన్నీ చేసేశా. వీటికి సంబంధించిన‌ వీడియోలు కూడా పోస్ట్ చేశా. ఆరో రోజు ఒక విష‌యం న‌న్ను బాగా క‌ల‌వ‌ర‌పెట్టింది.. మ‌న‌మంటే నెల‌కు స‌రిప‌డా నిత్యావ‌స‌ర వ‌స్తువుల్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని వాటితో బ‌తికేయ‌గ‌లం. కానీ ఇల్లులేని వాళ్లు, దిన‌స‌రి వేత‌నంతో బ‌తికే కార్మికులు ఏమై పోతున్నారు, వాళ్ల ప‌రిస్థితేంటి? అనే ఆలోచ‌న వ‌చ్చేస‌రికి ఒక రోజంతా కుదురుగా ఉండ‌లేక‌పోయా. నిద్ర స‌రిగా ప‌ట్ట‌లేదు, తిండి స‌రిగా తిన‌లేక‌పోయాను. అలాంటి వాళ్ల‌కు చాలా మంది చాలా ర‌కాలుగా సాయం చేస్తున్నార‌ని తెలుసు.

ఈ సంక్లిష్ట కాలంలో తెలంగాణ ప్ర‌భుత్వం చాలా బాగా ప‌నిచేస్తోంది. మ‌నంద‌రం కూడా ఒక‌రికొక‌రం చేత‌నైనంత సాయం చేసుకోవాలి. ఎవ‌రింట్లో వారుండి దేశాన్ని కాపాడే స‌మ‌యం వ‌చ్చింది అని చెబుతున్నారు. అది నిజం. వ‌చ్చే వారం రోజులు మ‌న‌కు చాలా కీల‌క‌మైన‌వి. వైర‌స్ బాగా వ్యాప్తి చెందడానికి అవ‌కాశం ఉన్న కాలం ఇది. ఆస్ట్రాల‌జీ ప్ర‌కారం చంద్రుడి మీద‌కు రాహువు వ‌స్తున్నాడు. శ‌ని, అంగార‌కుడు, గురు గ్ర‌హాలు మూడూ క‌లుసుకోబోతున్నాయి. జ్యోతిషం ప్ర‌కారం ఇది చాలా ప్ర‌మాద‌క‌రం. అంటే ఆ స‌మ‌యంలో వైర‌స్ వేగంగా వ్యాప్తి చెంద‌డానికి అవ‌కాశం ఉంది. ఈ టైమ్‌లో మ‌నం బ‌య‌ట‌కు వెళ్ల‌క‌పోవ‌డం చాలా ముఖ్యం.

ఈ రోజు (సోమ‌వారం) రాత్రి నుంచి ఏప్రిల్ 2 వ‌ర‌కు బ‌య‌ట‌కు వెళ్లి స‌రుకులు కొన‌డం మానుకొని, ఇంట్లో ఉన్న‌వాటితో స‌రిపెట్టుకొంటే మంచిది. అలాగే వేడి నీళ్ల‌లో ప‌సుపు, తుల‌సి, వాము క‌లిపి.. ఆవిరి ప‌ట్టుకుంటే వైర‌స్ దూరంగా తొల‌గిపోతుంది. ఆవిరి ప‌ట్టిన కొద్దిసేప‌టి వ‌ర‌కు అలాగే ఉండి, ఆ త‌ర్వాతే ముఖం క‌డుక్కోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల వైర‌స్ నుంచి మ‌న‌ల్ని మ‌నం కాపాడుకున్న‌వాళ్ల‌మ‌వుతాం. చెప్పిందే మ‌ళ్లీ మ‌ళ్లీ చెపుతున్నార‌నుకోవ‌ద్దు.. ఎందుకంటే ఇది చాలా ముఖ్యం..

ఎప్ప‌టిక‌ప్పుడు చేతులు శుభ్రంగా క‌డుక్కుంటూ ఉండండి, సామాజిక దూరం పాటించండి, ఇంట్లో ఉండండి. అంతేకాదు, ఏప్రిల్ 14 త‌ర్వాత మ‌న‌కు స్వేచ్ఛ వ‌స్తుంది, బ‌య‌ట‌కు వెళ్ల‌వ‌చ్చు.. అనుకోకండి. ఇంకో ప‌దిహేను రోజులు లేదా నెల రోజులు లేదా రెండు నెల‌లు కూడా ఇంట్లోనే ఉండాల్సి రావ‌చ్చు. మ‌న‌కు తెలీదు. ప్ర‌భుత్వం చెప్పిన స‌ల‌హాలు, సూచ‌న‌ల‌ను త‌ప్ప‌నిస‌రిగా పాటించండి. అప్పుడే రాష్ట్రం, దేశం ప‌రిశుభ్రంగా ఉంటాయి. మ‌నం వైర‌స్ నుంచి దూరంగా ఉండ‌గ‌లుగుతాం. ఎవ‌రిళ్ల‌ల్లో వారు సుర‌క్షితంగా ఉండండి” అని వివ‌రించారు.

- Advertisement -