ప్రముఖ బాలీవుడ్ గాయకుడు జుబిన్ నౌటియాల్ తన చిన్ననాటి స్నేహితురాలు, చిరకాల ప్రేయసిని ఉత్తరాఖండ్‌లో జరిగిన ఒక ప్రైవేట్ వేడుకలో వివాహం చేసుకున్నారు. అత్యంత సన్నిహితులు మరియు కుటుంబ సభ్యుల మధ్య ఈ వివాహం నిరాడంబరంగా జరిగింది.
ఇటీవల ‘ధురంధర్’ చిత్రంలో ‘ఆఖరి ఇష్క్’ పాటతో అలరించిన జుబిన్, తన వివాహ వేడుకను మీడియా వెలుగులకు దూరంగా ఉంచారు. ఉత్తరాఖండ్‌లోని తన స్వస్థలంలో జరిగిన ఈ వేడుకకు సినిమా రంగానికి చెందిన ప్రముఖులెవరినీ ఆహ్వానించలేదు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఫోటోలో జుబిన్ సాంప్రదాయ వివాహ దుస్తులలో కనిపిస్తుండగా, వధువు ముఖం కనిపించకుండ ఫోటో తీశారు.
భారీ హంగూ ఆర్భాటాలతో కూడిన ‘బిగ్ ఫ్యాట్ ఇండియన్ వెడ్డింగ్’ కాకుండా, అత్యంత సాధారణ పద్ధతిలో సాంప్రదాయబద్ధంగా ఈ వివాహం జరిగింది. జుబిన్ తన వ్యక్తిగత జీవితాన్ని ఎప్పుడూ గోప్యంగా ఉంచడానికి ఇష్టపడతారని సమాచారం.
జుబిన్ నౌటియాల్ తన అద్భుతమైన గొంతుతో బాలీవుడ్‌లో అనేక చార్ట్‌బస్టర్ సాంగ్స్ అందించారు.షేర్షా, కబీర్ సింగ్, మర్జావాన్, జజ్బా, బాల, మరియు ది బాడీ వంటి చిత్రాల్లో సూపర్ హిట్ పాటలు పాడారు. సినిమా పాటలతో పాటు ‘లుట్ గయే’, ‘హుమ్నవా మేరే’, ‘బర్సాత్ కీ ధున్’, ‘బేవాఫా తేరా మాసూమ్ చెహ్రా’ వంటి సాంగ్స్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో రికార్డు స్థాయి వ్యూస్ సాధించాయి. జుబిన్ నౌటియాల్ వివాహ వార్త తెలిసిన ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Also Read:మన ఓటును కాపాడుకోవాలి: SIRపై కేటీఆర్

