సింగరేణి అంటే నల్ల బంగారం. అలాంటి బంగారంలో మీని ఫారెస్ట్‌ను ఏర్పాటు చేస్తున్న….. ఎన్.బలరామ్ డైరెక్టర్ (పర్సనల్, ఫైనాన్స్, పి అండ్ పి) ప్రారంభించిన హరిత హారం మహా యజ్ఞం నిర్విరామంగా చేపట్టడంతో సింగరేణి పుడమి తల్లి పచ్చదనాన్నిసంతరించుకుంది. తాజాగా ఆదివారం సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ఆవరణలో ప్రారంభించిన మినీ ఫారెస్టు ప్రారంభం సందర్భంగా ఆయన మరోమారు 500 మొక్కలను ఒంటరిగానే నాటి అందరిలోనూ పర్యావరణ స్ఫూర్తిని పెంచారు. ముఖ్యంగా అంతరించిపోతున్న వృక్ష జాతులైన చింత, ఉసిరి, నేరేడు, మద్ది, జువ్వి, రావి తదితర మొక్కలను ఆయన నాటారు. తాజాగా నాటిన 500 మొక్కలను కలుపుకొని గత మూడేళ్లుగా ఆయన ఒక్కడే సింగరేణి వ్యాప్తంగా 14,000 మొక్కలు నాటి వాటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎస్టీపీపీ ఆవరణలో ఎకరా స్థలం విస్తీర్ణంలో ప్రారంభించిన మినీ ఫారెస్టుతో థర్మల్ విద్యుత్ కేంద్రం హరిత శోభను సంతరించుకుంటుందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న డైరెక్టర్లు ఎస్.చంద్రశేఖర్ (ఆపరేషన్స్), ఎన్.బలరామ్ కార్యక్రమంలో పేర్కొన్నారు. 2019 జులై 20న కూడా ఎస్టీపీపీ ఆవరణలో డైరెక్టర్ ఎన్.బలరామ్ 501 మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా బలరామ్ మాట్లాడుతూ… సింగరేణి సంచాలకుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటి సారిగా జూన్ 5, 2019న బంగ్లాస్ ఏరియాలో తాను 108 మొక్కలు నాటిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. సింగరేణి లో ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాలని, తెలంగాణ లో పచ్చదనాన్ని పెంపొందించాలన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆకాంక్షలను నెరవేర్చాలన్నారు. అలాగే సింగరేణి ఛైర్మన్ మరియు ఎండీ ఎన్.శ్రీధర్ ఆదేశాల మేరకు హరిత హారంలో ఇప్పటికే దాదాపు 6 కోట్లకు పైగా మొక్కలు నాటామని తెలిపారు.
శ్రీరాంపూర్ లోని ఉపరితల గని మట్టి కుప్పపై 2019 జులై 20వ తేదీన జరిగిన మెగా హరిత హారంలో భాగంగా పాల్గొని… 1237 మొక్కలను గంట వ్యవధిలో నాటి అందరూ ఆశ్చర్యపడేలా చేశారు. అదే రోజూ జైపూర్ ఎస్టీపీపీలో జరిగిన హరిత హారంలో 501 మొక్కలు నాటారు. గత ఏడాది జూలై 24 న రామగుండం లో నిర్వహించిన ముక్కోటి వృక్షార్చన లో మొక్కను నాటడం ద్వారా 12 వేల మొక్కలను నాటి మరో మైలు రాయిని అందుకున్నమన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కొత్తగూడెం బంగ్లాస్ లో 205 గులాబీ మొక్కలను నాటి గులాబీ వనాన్ని (రోజ్ గార్డెన్) ప్రారంభించారు. జపాన్ లో ప్రాచుర్యం పొందిన మియావాకీ పద్ధతిలో మొక్కల పెంపకాన్ని ఇల్లందు, భూపాలపల్లి ఏరియాలో ప్రారంభించారు. ఆయన నాటిన మొక్కలకు జియో ట్యాగింగ్ చేయించి, సంరక్షిస్తుండటంతో అవి ఏపుగా పెరిగి చిన్నపాటి అడవులను తలపిస్తున్నాయిని సింగరేణి కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అందరిలోనూ పర్యావరణ స్పృహను కల్పించేందుకు కృషి చేస్తున్న బలరామ్ సేవలను గుర్తిస్తూ గ్రామోదయ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ టెక్నాలజీ వారు గ్రామోదయ బంధు మిత్ర పురస్కారంతో సత్కరించింది. రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ సారథ్యంలోని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థ ఆయనకు వన మిత్ర పురస్కారాన్ని అందజేసింది. సమాజ అభ్యున్నతికి నిస్వార్థంగా సేవలు అందించే వ్యక్తులకు ప్రముఖ ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ సంస్థ అవర్ నైబర్‌హుడ్ హీరో పురస్కారంతో సన్మానించింది. భువనేశ్వర్‌లో జరిగిన అంతర్జాతీయ జియో మైన్ టెక్ అవార్డులో ఎన్విరాన్‌మెంట్ ఎక్స్‌లెన్స్ అవార్డు పొందడం సంతోషంగా ఉందన్నారు.