తెలంగాణలో కీలక ప్రజా రంగ సంస్థ అయిన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ రాష్ట్ర ఏర్పాటుకు తరువాత తొలిసారిగా లక్ష్యాన్ని చేరుకోలేకపోవడం సంస్థ భవిష్యత్తుపై చర్చకు దారితీసింది.
ఈ ఏడాది ప్రారంభంలో సింగరేణి 76 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. కానీ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆ లక్ష్యాన్ని 60 మిలియన్ టన్నులకు తగ్గించింది. అయినప్పటికీ, తుది గణాంకాల ప్రకారం కేవలం 58 మిలియన్ టన్నుల బొగ్గు మాత్రమే వెలికితీయగలిగింది.
గతంలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలోని ప్రభుత్వ కాలంలో సింగరేణి రికార్డు స్థాయిలో 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసింది. ఆ సమయంలో సంస్థ లాభాల దిశగా దూసుకెళ్లింది. కానీ ప్రస్తుతం ఉత్పత్తి పడిపోవడం, లక్ష్యాలను చేరుకోలేకపోవడం సంస్థ పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.
సింగరేణిలో భారీ అవినీతి, నిర్వాహక లోపాలు కారణంగా సంస్థ నష్టాల అంచుల్లోకి చేరిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రాజెక్టుల అమలు, వనరుల వినియోగంలో లోపాలు ఉన్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేసీఆర్ హయాంలో మంచి ప్రదర్శన కనబరిచిన సింగరేణి, ఇప్పుడు అస్తవ్యస్తంగా మారిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
Also Read:డిజిటల్ అరెస్ట్ పేరుతో భారీ మోసం!
ఉత్పత్తి తగ్గిపోవడంతో ఈ ఏడాది లాభాలు వస్తాయా లేదా అన్న అనుమానంలో సంస్థ యాజమాన్యం ఉంది. ఖర్చులు పెరగడం, ఉత్పత్తి తగ్గడం కలిసి ఆర్థిక ఒత్తిడిని పెంచుతున్నాయి. సింగరేణి తిరిగి పూర్వ వైభవం సాధించాలంటే పారదర్శకత, సమర్థవంతమైన నిర్వహణ, దీర్ఘకాలిక వ్యూహాలు అత్యవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

