చంద్రబాబుతో భేటీ పై సింగపూర్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మంత్రి కీలక ప్రకటన చేశారు. ఏపీ, అమరావతి అభివృద్ధిలో సింగపూర్ భాగస్వామ్యం కొనసాగుతుందని తెలిపారు మంత్రి టాన్సీ లెంగ్.
సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన ఫలప్రదం కావాలని ఆకాంక్షించారు. భారత్ లో అత్యంత వేగంగా ఎదుగుతున్న రాష్ట్రాల్లో ఒకటైన ఏపీలో పెట్టుబడులు, కార్యకలాపాల విస్తరణకు సింగపూర్ కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయని తెలిపారు.
పోర్టులు, గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ టెక్నాలజీ , నైపుణ్యాభివృద్ధి రంగాల్లో పెట్టుబడులపై సీఎం చంద్రబాబుతో చర్చించినట్టు సింగపూర్ మంత్రి టాన్ సీ లెంగ్ ప్రకటించారు. 2014-2019లో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి నాటి ప్రభుత్వంతో కలిసి పని చేశామని తెలిపారు సింగపూర్ మంత్రి.
మాస్టర్ ప్లాన్ రూపకల్పన, నిర్మాణ సహకారాన్ని అందించినట్టు గుర్తు చేశారు మంత్రి టాన్ సీ లెంగ్. అమరావతిలో స్టార్టప్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు సింగపూర్ కంపెనీలు స్విస్ ఛాలెంజ్ విధానంలో టెండర్ కూడా దక్కించుకున్నాయని తెలిపారు. 2019లో ప్రభుత్వం మారాక ఒప్పందంలో కొనసాగేందుకు సహకారం ఆగిపోయిందని ప్రకటనలో పేర్కొన్నారు.
Also Read:ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి: పొన్నం
ఆ కారణంగానే అమరావతి ప్రాజెక్టు నుంచి సింగపూర్ కన్సార్టియం బయటకు వచ్చేసిందని …గత అనుభవాల కారణంగా సీడ్ క్యాపిటల్ విషయంలో సింగపూర్ కన్సార్టియం పని చేయకున్నా.. అమరావతిలో, ఏపీలో పట్టణాభివృద్ధి సహా వివిధ రంగాల్లో అభివృద్ది ప్రణాళికల్లో కలిసి పని చేస్తామని స్పష్టం చేశారు టాన్ సీ లెంగ్.

