శింబు తండ్రి టి.రాజేందర్ బహుముఖ ప్రజ్నాశాలి అన్న సంగతి తెలిసిందే. ఆయన దర్శకుడు.. హీరో.. రైటర్.. సింగర్.. మ్యూజిక్ డైరెక్టర్. గతంలో ఎన్నో పాటలు పాడారు కూడా. ఇప్పుడు తన భార్యతో కలిసి ఆయన ఓ పాట అందుకున్నారు. తమిళ హీరో శింబు తల్లి ఉషా ఒక సినిమాలో పాట పాడటం విశేషం. ఐతే ఉష పాట పాడింది శింబు సినిమాకు కాదు. కమెడియన్ టర్న్డ్ హీరో సంతానం ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘సక్క పోడు పోడు రాజా’ అనే చిత్రానికి. విశేషం ఏంటంటే ఈ చిత్రానికి శింబునే సంగీత దర్శకుడు. శింబు లాంటి హీరో సంతానం సినిమాకు సంగీతం అందించడమే చిత్రమంటే.. అందులో అతడి తల్లి.. తండ్రి ఇద్దరూ కలిసి ఒక పాట పాడటం మరో విషయం.
హీరోల కొడుకులు.. కూతుళ్లు సినిమాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడం మామూలే. కానీ ఒక హీరో తల్లి ఒక సినిమాలో తన టాలెంట్ చూపించడానికి ముందుకు రావడం అరుదైన విషయం. ఈ పాట చాలా ప్రత్యేకంగా ఉంటుందని శింబు అంటున్నాడు. శింబు చాలా సినిమాల్లో తన సింగింగ్ టాలెంట్ చూపించాడు. కొన్ని పాటల్ని తనే కంపోజ్ చేసుకున్నాడు. ఇప్పుడు మరో హీరో సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. శింబు తమ్ముడు కురాలరసన్ కూడా ‘ఇదు నమ్మ ఆళు’ అనే సినిమాకు సంగీత దర్శకుడిగా పని చేయడం విశేషం.