శిఖండి రాజకీయాలకు c/o బీజేపీ :కేటీఆర్‌

70
- Advertisement -

దేశంలో రాజ్యంగ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ బీజేపీ ఒక దుష్ట సంస్కృతికి తెర లేపింది అని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. బీజేపీ నేత ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్‌ కేటీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా భిక్షమయ్య గౌడ్‌కు కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్‌ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడుతూ బీజేపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మునుగోడులో ధనబలంతో గెలవాలని బీజేపీ ప్రయత్నిస్తున్నది అని మండిపడ్డారు.

చిత్తశుద్ధితో సంక్షేమానికి, అభివృద్ధికి కట్టుబడి పని చేస్తున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఫ్లోరైడ్ విషయంలో ఆరు దశాబ్దాలుగా కాని పనిని నాలుగేండ్లలో చేసి చూపెట్టామని తెలిపారు. ఆడబిడ్డలకు నీటి కష్టాలు లేకుండా చేశామన్నారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగ ఉపాధి కల్పన దిశగా దండుమల్కాపూర్‌లో పారిశ్రామిక సమూహాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

బీజేపీ వ్యవస్థలన్నీ దుర్వినియోగం చేస్తున్న విషయం మనకు కనబడుతుంది. వ్యవస్థలను అడ్డం పెట్టుకుని, బీజేపీ శిఖండి రాజకీయం చేస్తోందని కేటీఆర్ నిప్పులు చెరిగారు. కానీ నల్లగొండ బిడ్డలు చైతన్యవంతులు, సాగర్ హుజుర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చారు. భిక్షమయ్య గౌడ్‌ రాకతో మరింత బలంతో, ఉత్సాహంతో ముందుకు పోతామన్నారు. ఈసారి కూడా మునుగోడులో కూడా అదే తీర్పు పునరావృతం అవుతుందన్నారు.

ఉద్యమం ప్రారంభించినప్పటి నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీని వెన్నంటి ఉన్న నాయకుడు ప్రభాకర్ రెడ్డి. ఉద్యమ సమయంలో జైలుకు వెళ్లొచ్చిన బిడ్డ కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అని అన్నారు. అలాంటి నాయకుడిని ప్రజలు గుండెలకు హత్తుకుంటారన్న నమ్మకం ఉంది. ఈ ఎన్నిక తెలంగాణ భవితవ్యంపై తీవ్ర ప్రభావం చూపనుంది. చైతన్యంతో కూడిన తీర్పును ఇవ్వాలి. తిరుగులేని తీర్పును ఇచ్చి.. తప్పకుండా బీజేపీకి బుద్ధి చెప్పాలని కేటీఆర్ సూచించారు.

- Advertisement -